Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ విమర్శ
చెన్నై : వన్ నేషన్, వన్ రేషన్ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం ప్రజా పంపిణీ వ్యవస్థ యొక్క మౌలిక లక్ష్యాన్ని దెబ్బతీస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ఈ వెంకట్ విమర్శించారు. తమిళనాడులోని ఈరోడ్డు పట్టణంలో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ దేశమంతా ఒకే రేషన్ కార్డు అంటే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రేషన్ పద్ధతిలో సమూల మార్పులు చేస్తారని, దానివల్ల కొన్ని రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో ఉచితంగాను, మరికొన్ని రాష్ట్రాల్లో ఒక రూపాయికి ఒక కేజీ బియ్యం, గోధుమలు సరఫరా చేస్తున్నారని తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో 70, 80 శాతం మంది ప్రజలకు ప్రజా పంపిణీ ద్వారా రేషన్ సరుకులు అందుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం ఈ వన్ నేషన్,వన్ రేషన్ పేదల సంఖ్య కుదించేందుకు చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఒక వైపు సార్వజనీన ప్రజా పంపిణీ వ్యవస్థ కావాలనీ, అన్ని రకాల నిత్యవసర వస్తువులు ప్రజా పంపిణీ ద్వారా అందజేయాలని ప్రజలు కోరుతుంటే దాన్ని కుదించే చర్యలకు కేంద్రం పాల్పడటం దుర్మార్గమని అన్నారు. ప్రపంచమంతా ఆహార భద్రత, గృహ నిర్మాణంపై సుదీర్ఘంగా చర్చిస్తుంటే ఆ లక్ష్యాలకు తిలోదకాలు ఇచ్చే విధంగా మన కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. ఆహార భద్రత అనేది సమాజం మనుగడతో ముడిపడి ఉంటుందని, ఆహార భద్రత లేకపోతే మారణ హౌమం జరుగుతుందని ఆయన తెలిపారు. కోవిడ్ కాలంలో కూడా దేశంలో 28 నుంచి 29 కోట్ల మెట్రిక్ టన్నులకు ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందని, అదే సందర్భంలో ఆకలి సమస్య కూడా పెరిగిందని, ప్రపంచ ఆకలి సూచికలో భారత్ 109వ స్థానంలో ఉందని ఆయన అన్నారు. ఈ స్థితిలోనే ఆహార ధాన్యాలు పంపిణీ చేయడం అత్యంత అవసరమని ఆయన అన్నారు.