Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నటుడిని అరెస్టు చేసిన అసోం పోలీసులు
- హిందూ దేవుడి పాత్రపై హిందూత్వ సంఘాల అభ్యంతరం
గువహతి : ధరల పెరుగుదల విషయంలో కేంద్రం తీరుపై వీధి నాటకంలో హిందూ దేవుడి వేషం వేసిన ఒక వ్యక్తి అరెస్టయ్యాడు. బీజేపీ పాలిత అసోంలోని నాగౌన్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకున్నది. మత భావాలు దెబ్బతీశాడన్న ఆరోపణలపై సదరు వ్యక్తిని అసోం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు, సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పాలనలో పెరగుతున్న ధరలకు వ్యతిరేకంగా బిరించి బోరా శనివారం ఒక వీధి నాటకంలో పాల్గొన్నాడు. అందులో ఆయన హిందూ దేవుడి పాత్రను ధరించాడు. హిందూ దేవుడి భార్యగా పరిష్మిత నటించారు. అయితే, వీరి నాటకానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరలయ్యాయి. ఆ ఇద్దరు నటులు ఒక ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పెట్రోల్ అయిపోవటంతో వాహనం మధ్యలోనే ఆగిపోవటం ఆ వీడియోలో ఉన్నది. వాహనం ఆగిపోవటంతో ఆ ఇద్దరు ఒకరితో ఒకరు వాదనకు దిగుతారు. పెరిగిన ధరల, నిరుద్యోగం, దేశం ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై హిందూ దేవుడి పాత్ర కేంద్రాన్ని విమర్శిస్తుంది. ధరలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రేక్షకులనూ కోరినట్టు వీడియోలో కనిపించింది. అయితే, ఈ వీధి నాటకంపై హిందూత్వ సంఘాలు అభ్యంతరం తెలిపాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఫిర్యాదు అనంతరం పోలీసులు బోరాను అదుపులోకి తీసుకొని నాగౌన్ సదర్ పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్టుగా అనుమానిస్తున్న మరో ఇద్దరు నిందితులను పట్టుకోవాల్సి ఉన్నదని పోలీసు అధికారి మనోజ్ రాజ్వంశి తెలిపారు. కాగా, నటులపై పోలీసులు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ విషయంలో పోలీసులకు 'తగిన ఆదేశాలు' జారీ చేసినట్టు అసోం సీఎం హిమంత విశ్వ శర్మ ట్వీట్ చేశారు. కాగా, బోరాపై నమోదైన అన్ని సెక్షన్లూ బెయిల్‌కు అనూలమైనేవేననీ, ఆయన ఆదివారమే విడుదలయ్యాడని నాగౌన్ పోలీసు అధికారి లీనా డోలీ చెప్పారు.