Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేదంటే పార్లమెంటరీ పరిశీలనకు పంపాలి
- పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ భేటీలో ప్రతిపక్షాలు
- రాజ్‌నాథ్ సింగ్‌కు ప్రతిపక్షాల లేఖ
- లేఖపై సంతకం చేసేందుకు నిరాకరించిన కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ
న్యూఢిల్లీ : వివాదాస్పద సాయుధ దళాల రిక్రూట్మెంట్ అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకపోతే దాన్ని పార్లమెంటరీ పరిశీలనకు పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. సోమవారం నాడిక్కడ పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన రక్షణ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సమావేశం జరిగింది. ''అగ్నిపథ్'' పథకంపై సభ్యులకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరణాత్మక ప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే ఈ పథకంపై ప్రతిపక్షాలు లేవనెత్తిన ఆందోళనల పట్ల ప్రభుత్వ స్పందనపై ప్రతిపక్ష ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అగ్నిపథ్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రాజ్‌నాథ్ సింగ్‌కు మెమోరాండం సమర్పించారు. సౌగత్ రారు, సుదీప్ బందోపాధ్యాయ (టీఎంసీ), సుప్రియా సూలే (ఎన్సీపీ), శక్తిసిన్హ్ గోహిల్, రజనీ పాటిల్ (కాంగ్రెస్), ఎడి సింగ్ (ఆర్జేడీ) మెమోరాండంపై సంతకాలు చేశారు. ప్రతిపక్షాల మెమోరాండంపై కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ సంతకం చేయలేదు.
ఈ సమావేశంలో అగ్నిపథ్ స్కీమ్‌పై లోతుగా చర్చించారు. ఈ పథకంపై ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. అగ్నిపథ్ స్కీమ్ ఉద్యోగాల కోసం ఎక్కువ దరఖాస్తులు వచ్చాయంటే భారీ నిరుద్యోగిత ఉందని అర్థమని ప్రతిపక్ష నేతలు స్పష్టం చేశారు. దేశంలో నిరుద్యోగం అధికంగా ఉండటంతోనే యువత ఈ పథకానికి పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారనే వాస్తవం ముఖ్యమైనదని, ప్రభుత్వం ఎందుకు పరిష్కరించడం లేదని ప్రతిపక్ష ఎంపీలు ప్రశ్నించారు. ''సైన్యం ఒక వ్యూహాత్మక విభాగం. ఇది దేశ భద్రతకు బాధ్యత వహిస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి నాలుగు సంవత్సరాలు పని చేసి, ఆపై వదిలివేస్తే, అతను లేదా ఆమె దేశ భద్రతపై రాజీపడరని హామీ ఏమిటి? మాజీ మిలిటరీ సిబ్బంది కాల్చి చంపిన జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకి ఏమి జరిగిందో ఒక అద్భుతమైన ఉదాహరణ'' అని పేర్కొన్నారు. అలాగే రష్యా, ఉక్రెయిన్లతో సహా వివిధ దేశాల్లోని వివిధ అంశాలను ప్రతిపక్ష నేతలు ఉటంకించారు. సదీర్ఘ కాలం పాటు పనిచేసిన సైన్యం కఠినమైన శిక్షణతో ప్రభావవంతంగా, శక్తివంతంగా ఉంటుందని ప్రతిపక్ష నాయకులు తెలిపారు. ''తాత్కాలిక రిక్రూట్మెంట్ల ద్వారా సైన్యాన్ని ఎందుకు బలహీనపరచాలి? మాజీ సీడీఎస్ బిపిన్ రావత్ కూడా సుదీర్ఘ రిక్రూట్మెంట్లకు అనుకూలంగా ఉన్నారు. అయితే దేశం మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఇచ్చిన సలహాలను కూడా ప్రభుత్వం ఎందుకు పాటించడం లేదు?'' అని ప్రతిపక్ష నేతలు నిలదీశారు. అలాగే సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగడాన్ని కూడా ప్రతిపక్ష ఎంపిలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజకీయ నాయకులకు బదులు సాయుధ దళాల సిబ్బంది ఎందుకు విలేకరుల సమావేశాలు నిర్వహిస్తున్నారని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సమావేశం అనంతరం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ''ఇది చాలా మంచి సమావేశం'' అని అన్నారు. ఇటీవల దేశంలోని చాలా చోట్ల హింసకు దారితీసిన పథకంపై సీనియర్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు కమిటీ సభ్యులకు వివరించారని అన్నారు. టీఎంసీ ఎంపీ సౌగతా రారు మాట్లాడుతూ ''ప్రభుత్వం మా ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా సమాధానం ఇవ్వలేకపోయింది. కాబట్టి దేశవ్యాప్తంగా విస్తృత సంప్రదింపులు జరపాలని రాజ్‌నాథ్ సింగ్‌కు ఆరుగురు ప్రతిపక్ష సభ్యులు లేఖ రాశాం. అగ్నిపథ్ పథకాన్ని రక్షణ స్టాండింగ్ కమిటీకి పంపాలని కోరుతూ లేఖ రాశాం'' అని అన్నారు. ఈ సమావేశంలో నలుగురు బిజెపి ఎంపిలు సహా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 12 మంది ఎంపిలు హాజరయ్యారు. బిజెపి ఎంపిలు రంజన్‌బెన్ భట్, రామ్ భారు మొఖారియా, కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి (డిఫెన్స్ సెక్రటరీ) అజరు కుమార్, ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే, నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ వివేక్ రామ్ చౌదరి త్రివిధ దళాలకు చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.