Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యాపార విస్తరణ కోసం అవకతవకలు, అనైతిక చర్యలు
- భారత్ సహా ఐరోపా దేశాల్లో చట్ట విరుద్ధ కార్యకలాపాలు
- ట్యాక్సీ మార్కెట్ హస్తగతం చేసుకునేందుకు..లాబీయింగ్ : ఉబర్ ఒప్పుకోలు
- రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు రూ.715కోట్ల ముడుపులు!
- అప్పటితో పోలిస్తే...మేం చాలా మారిపోయాం..ఇప్పుడలాంటివి లేవని ఉబర్ వెల్లడి
- న్యూఢిల్లీలో ఉబర్ క్యాబ్ డ్రైవర్ లైంగికదాడి..ఆ కేసులో కంపెనీ డేటా గల్లంతు
న్యూఢిల్లీ : అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న ట్రాన్స్పోర్ట్ కంపెనీ 'ఉబర్' అక్రమాలు, చట్ట విరుద్ధ చర్యలు బయటపడ్డాయి. 72 దేశాల్లో 10వేలకుపైగా నగరాల్లో 'ఉబర్' ట్యాక్సీ (కారు, కారు డ్రైవర్ బుకింగ్) సేవల్ని అందిస్తోంది. అయితే వ్యాపార విస్తరణ కోసం భారత్, ఐరోపా దేశాల్లో ఉబర్ యాజమాన్యం అనేక అక్రమాలకు పాల్పడిందని కొన్ని కీలక పత్రాలు (ఉబర్ ఫైల్స్) ద్వారా తెలుస్తోంది. ఆయా దేశాల్లో ట్యాక్సీ సేవల్ని పొందటం కోసం అక్కడి రాజకీయ నేతల్ని, ప్రభుత్వ అధికారుల్ని ప్రభావితం చేసిందని, ఇందుకోసం ఉబర్ ప్రతిఏటా దాదాపు 90 మిలియన్ డాలర్ల (సుమారుగా రూ.715కోట్లు) మొత్తాన్ని ఉపయోగించినట్టు లీకైన్ ఈమెయిల్స్ ద్వారా బహిర్గతమైంది.
వివిధ రకాల ఆఫర్లు, ప్రలోభాలతో పలు దేశాల్లో కీలక వ్యక్తుల్ని ప్రభావితం చేసిందని తేలింది. పన్ను సోదాలు, సమాచార సేకరణ వంటి కఠిన నియంత్రణ చర్యల నుంచి తప్పించుకునేందుకు వర్చువల్ ప్రయివేటు నెట్వర్క్ ఫీచర్ అయిన 'కిల్ స్విచ్' అనే సాఫ్ట్‌వేర్‌ను వాడినట్టు బహిర్గతమైంది. కిల్ స్విచ్ వినియోగిస్తే తనిఖీలు లేదా నియంత్రణ చర్యలు, అత్యవసర సమయాల్లో కంప్యూటర్లు వాటంతటవే షట్‌డౌన్ అవుతాయి. తద్వారా ప్రభుత్వ అధికారులకు సమాచారం లభించదు. ఇందుకోసం తొలుత కాస్పర్, ఆ తర్వాత రిప్లే సాఫ్ట్వేర్లను ఉబర్ ఉపయోగించినట్టు లీకైన ఈ-మెయిల్స్ (ఉబర్ ఫైల్స్) ద్వారా పరిశోధనాత్మక జర్నలిజం గుర్తించింది. 2013-17 మధ్యకాలంలో ఉబర్‌కు సంబంధించిన 1,24,000 డాక్యుమెంట్లను బ్రిటన్ డైలీ 'ది గార్డియన్' సేకరించింది. ఈ సమాచారాన్ని ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిసం (ఐసీఐజే)తో పంచకోవడంతో పై వివరాలు వెల్లడయ్యాయి.
భారత్‌లో ఏం చేశారు?
ఫిబ్రవరి 10, 2015న కిల్ స్విచ్ని భారత్‌లో వాడినట్టు లీకైన ఉబర్ ఫైల్స్ చెబుతున్నాయి. 2014 చివరిలో న్యూఢిల్లీలో ఉబర్ క్యాబ్‌లో లైంగికదాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనంతరం ఉబర్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. దాంతో ఢిల్లీ నగరంలో ఉబర్ సర్వీసులపై కొంతకాలం నిషేధించారు. ఈ పరిణామం జరిగిన 2 నెలల తర్వాత భారత్‌లో కిల్ స్విచ్‌ను ఉబర్ వాడినట్టు తేలింది. భారత్‌లో దర్యాప్తు సంస్థ అధికారులకు ఉబర్ డేటా లభించకుండా ఏ విధంగా వ్యవహరించాలో ఉబర్ మేనేజర్ రొబో వాండెర్ వూండే ఇండియన్ ఉబర్ ఎగ్జిక్యూటివ్‌లకు సూచించారు. ''భారత్‌లో జరిగిన ఘటనపై ఢిల్లీ ఉబర్ టీం సాధ్యమైనంత సహకారం అందించాలి. విషయాన్ని బీవీ (నెదర్లాండ్‌లోని ఓ కంపెనీ)కి మళ్లించండి. సమాచారం కావాలంటూ అధికారులు కోరినప్పుడు మనం కంప్యూటర్లను షట్‌డౌన్ చేస్తాం. ఇలా చేస్తే అధికారులకు సమాచారం సేకరించడం సాధ్యపడదు. నెదర్లాండ్‌లోని బీవీ ప్రతినిధులతో మాట్లాడాలని అధికారులకు సూచిస్తా''మని ఈ-మెయిల్లో వాండెర్ వూండే పేర్కొన్నారు.
అనేక దేశాల్లో ఇదే పని..
ఉబర్ ఫైల్స్ ప్రకారం, 2014-16 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు నగరాల్లో 13సార్లు 'కిల్ స్విచ్'ని ఉబర్ వాడింది. భారత్‌లోని న్యూఢిల్లీతోపాటు ఆమ్స్టర్డామ్, మెంట్రియల్, హాంకాంగ్, బడాపెస్ట్, లియోన్, పారిస్ నగరాల్లో ఉపయోగించారు. సెప్టెంబర్ 2015లో ఆమ్‌స్టర్‌డామ్‌లో ఉపయోగించినప్పుడు స్వయానా ఉబర్ సహ వ్యవస్థాపకుడు ట్రావీస్ కలనిక్ ఆదేశాలు ఇచ్చారని తేలింది. బ్రస్సెల్స్‌లో 2015లో ఉబర్ ఆఫీస్‌పై ట్యాక్స్ సోదాల సమయంలో కిల్ స్విచ్ ఉపయోగించాలని భావించారు. బెల్జియం వ్యాట్ రిటర్న్ నిబంధనలను అతిక్రమించిందని స్పెషల్ ట్యాక్స్ ఆఫీసర్లు పేర్కొన్నారు.
ఇప్పుడలా కాదు
అవకతవకలకు పాల్పడ్డట్టు ఉబర్ సైతం అంగీకరించింది. అప్పటితో పోలిస్తే కంపెనీ ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని చెప్పుకొచ్చింది. ఐరోపా ట్యాక్సీ మార్కెట్‌ను హస్తగతం చేసుకునేందుకు ఏటా 90 మిలియన్ డాలర్ల వరకు లాబీయింగ్ కోసం ఖర్చు చేసినట్టు తెలిసింది. ఈక్రమంలో అనేకమంది ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులకు ముడుపులు అందజేసినట్టు స్పష్టమవుతోంది. 2014లో ఆర్థికమంత్రిగా ఉన్న ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ (ప్రస్తుత ఫ్రాన్స్ అధ్యక్షుడు), ఐరోపా సమాఖ్య మాజీ డిజిటల్ కమిషనర్ నీలి క్రోస్...వంటి పెద్ద తలకాయలు ఉబర్‌కు అనుకూల నిర్ణయాలు తీసుకున్నట్టు లీకైన పత్రాల ద్వారా తెలుస్తోంది. దీనంతటికీ అప్పటి ఉబర్ బాస్ ట్రావిస్ కలనిక్ నిర్ణయాలే కారణమని సమాచారం. 2017లో ఆయనకు ఉద్వాసన పలికారు. తర్వాత వచ్చిన దారా ఖోస్రోషాహికి సంస్థ ప్రక్షాళన బాధ్యతలు అప్పగించినట్టు తాజాగా ఉబర్ పేర్కొంది.