Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : నూతన పార్లమెంట్ భవనంపై ప్రధాని మోడీ ఆవిష్కరించిన జాతీయ చిహ్నంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఎగ్జిక్యూటివ్ అధినేత అయిన ప్రధాని జాతీయ చిహ్నాన్ని ఎలా ఆవిష్కరించారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. చిహ్నాంలో పలు మార్పులు చేసి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే, విగ్రహావిష్కరణకు తమని ఆహ్వానించలేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. పార్లమెంట్, జాతీయ చిహ్నం దేశ ప్రజల కోసమని, కేవలం ఒక్కరికే సొంతం కాదని కాంగ్రెస్ పేర్కొంది. రాజ్యాంగ పరమైన అధికారాల విభజనను ఎగ్జిక్యూటివ్ హెడ్ తారుమారు చేశారని సిపిఎం వ్యాఖ్యానించింది. ప్రధాని మోడీ అన్ని రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించారని హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఇప్పటి వరకూ జాతీయ చిహ్నంలోని సింహాలు కేవలం చిన్నగా గర్జిస్తున్నట్లుగా ఉండగా.. కొత్తగా ఆవిష్కరించిన విగ్రహంలోని సింహాలు మానవులను తినే ధోరణిలో కనిపిస్తున్నాయని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి) ట్వీట్ చేసింది. ప్రధాని అమృతకాల్ వ్యాఖ్యను విమర్శిస్తూ.. సాధారణంగా జాతీయ చిహ్నంలోని సింహాలు తేలికపాటి గర్జనతో ఉండగా.. అమృతకాలంలో ఆవిష్కరించినవన్నీ కూడా మానవులను తినేసే ధోరణిలో ఉంటాయని ఆర్జెడి ఎద్దేవా చేసింది. పాత చిహ్నంలో మానవుని ఆలోచనను చూపుతుండగా, కొత్త చిహ్నం మనిషినిజమైన స్వభావాన్ని తెలుపుతున్నాయని విమర్శించింది. జాతీయ చిహ్నాన్ని, దేశ ప్రతిష్టకు చిహ్నమైన గంభీరమైన అశోకుని మూడు సింహాలను అవమానించారని రాజ్యసభ టిఎంసి ప్రతినిధి జవహర్ సిర్కార్ పేర్కొన్నారు. పాత జాతీయచిహ్నం, నూతన చిహ్నం రెండింటి ఫోటోలను షేర్ చేస్తూ.. పాత చిహ్నం అందంగా, నమ్మశక్యంగా ఉందని, రెండవది మోడీ వెర్షన్లో గర్జిస్తూ, దూకుడుగా ఉందని.. అవమానకరమని పేర్కొన్నారు. అయితే ఇది పెద్ద విగ్రహమని, చూసే సమయంలో చిన్నపాటి తేడాలు కనిపించవచ్చని చిహ్నం రూపకర్తలు సునీల్ డియోర్, రోమియోల్ మోసెస్ పేర్కొన్నారు. అంతే తప్ప చిహ్నంలో పెద్ద మార్పు లేదని, ఈ శిల్పం కళాకారులుగా తాము గర్వపడుతున్నామని అన్నారు.