Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీ, హర్యానా, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్రలో పొంగిపొర్లుతున్న నదులు
- గుజరాత్లో 8మంది.. మహారాష్ట్రలో ఐదుగురు మృతి
- ముంబయికి ఆరెంజ్ అలర్ట్
న్యూఢిల్లీ : ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అనేక రాష్ట్రాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వారం రోజులుగా గుజరాత్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర..తదితర రాష్ట్రాల్లో నదులు, వాగులు పొంగిపొర్లు తున్నాయి. వర్షాల కారణంగా గుజరాత్, మహారాష్ట్రలో మంగళవారం 13 మంది మరణించారు. జూన్ 1 నుంచి గుజరాత్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో గుజరాత్లో ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా గోడ కూలి ఎనిమిది మంది మరణించారు. అహ్మదాబాద్, రాజ్కోట్ సహా పలు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. ఉరుములు, వరదనీటిలో కొట్టుకొని పోవడం, చెట్లు, కరెంటు స్తంభాలు కూలడం సహా పలు ఘటనల్లో మొత్తంగా 64మంది మరణించారని గుజరాత్ మంత్రి రాజేంద్ర త్రివేదీ ట్విట్టర్లో వెల్లడించారు.
ఈ క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, అధికారులు హెచ్చరిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై వరదనీరు పారుతుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో కార్లు నీట మునిగినట్టు, రోడ్డు కుంగినట్టు సామాజిక మాధ్యమాల్లో, ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న దృశ్యాలను బట్టి తెలుస్తోంది. ముంబయికి గురువారం వరకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.
మహారాష్ట్రలో మొత్తం 27 జిల్లాలు, 236 గ్రామాలపై ఈ వర్ష ప్రభావం తీవ్రంగా పడింది. అలాగే పలు ప్రాంతాల్లో రానున్న కొద్ది గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురువనున్నాయని వెల్లడించింది. ఇప్పటివరకూ 5,873 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురువనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రతికూల వాతావరణం కారణంగా విమాన రాకపోకలపై ప్రభావం పడొచ్చని విమానయాన సంస్థ స్సైస్ జెట్ వెల్లడించింది.