Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆహార వస్తువుల ధరలు 12.41 శాతానికి పెరుగుదల
- 15 నెలలుగా రెండంకెల్లో...
- కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ డబ్ల్యూపీఐ రిపోర్టు విడుదల
న్యూఢిల్లీ : దేశంలో ధరల పెరుగుదల (ద్రవ్యోల్బణం) కొనసాగుతున్నది. గత 15 నెలలుగా ద్రవ్యోల్బణం రెండంకెల ఎగువనే ఉంటున్నది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హోల్సేల్ ధరల ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) గణాంకాల ప్రకారం ఈ ఏడాది జూన్లో 15.18 శాతం ద్రవ్యోల్బణం ఉంది. అందులో ఆహార వస్తువుల ధరల పెరుగుదల మేలో 10.89 శాతం ఉండగా, జూన్ నాటికి 12.41 శాతానికి పెరిగింది. కూరగాయల ధరలు 16.5 శాతం పెరిగాయి. ఆహార సూచీ (ఫుడ్ ఇండిక్స్) నెలవారీగా 1.3 శాతం పెరిగింది.
ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 15.38 శాతం ఉండగా, మే నెలలో 15.88 శాతానికి పెరిగింది. ఇది మూడు దశాబ్దాల్లో అత్యధిక ద్రవ్యోల్బణం. జూన్లో 15.18 శాతానికి స్వల్పంగా తగ్గింది. అయితే గత 15 నెలలుగా ద్రవ్యోల్బణం రెండంకెల్లోనే ఉంది. 2021 జూన్లో ద్రవ్యోల్బణం 12.07 శాతం ఉంది. ''జూన్లో అధిక ద్రవ్యోల్బణం రేటు ప్రధానంగా మినరల్ ఆయిల్స్, ఫుడ్ ఆర్టికల్స్, క్రూడ్ పెట్రోలియం, నేచురల్ గ్యాస్, బేసిక్ మెటల్స్, కెమికల్స్, కెమికల్ ప్రొడక్ట్స్, ఫుడ్ ప్రొడక్ట్స్ మొదలైన వాటి ధరల పెరుగుదల ఉంది. జూన్లో ఫుడ్ ఆర్టికల్స్ సెగ్మెంట్ 14.39 శాతం పెరిగింది. అంతకు ముందు నెలలో ఇది 12.34 శాతంగా ఉంది. నెలనెలా కూరగాయల ధరలు పెరగడమే కారణమని చెప్పవచ్చు. కూరగాయల ధరలు జూన్లో 56.75 శాతం పెరిగాయి. మేలో 56.36 శాతంగా నమోదయ్యా యి. బంగాళదుంప ధరలు 39.38 శాతం పెరిగాయి. పండ్ల ధరలు గత నెలలో 9.98 శాతం నుంచి 0.33 శాతానికి పెరిగాయి. పాలు ధర ఒక నెల క్రితం 5.81 శాతం నుంచి 6.35 శాతం పెరిగింది. గుడ్లు, మాంసం, చేపల ధరలు జూన్లో 7.24 శాతం పెరిగాయి. వంటగ్యాస్ ధరలు ధరలు 47.71 శాతం నుంచి 53.20 శాతానికి పెరిగాయి.
ఆహార వస్తువులు (2021 జూన్-2022 జూన్) ద్రవ్యోల్బణం
ఆహార వస్తువులు ధరలు పెరుగుదల (ద్రవ్యోల్బణం) 2021 జూన్లో 3.28 శాతం ఉంటే, ఈ ఏడాది జూన్లో 14.39 శాతానికి పెరిగింది. తృణధాన్యాల ధరలు పెరుగుదల గతేడాది జూన్లో -2.77 శాతం ఉండగా, ఈ ఏడాది జూన్లో 7.99 శాతం ఉన్నాయి. వరి -2.36 శాత ఉండగా, ఇప్పుడు 2.35 శాతం ఉంది. గోధుమలు -1.77 శాతం ఉండగా, ఇప్పుడు 10.34 శాతం ఉంది. పప్పులు 11.56 శాతం ఉండగా, ఇప్పుడు -2.82 శాతం ఉంది. కూరగాయలు -0.78 శాతం ఉండగా, ఇప్పుడు 56.75 శాతం ఉంది. బంగాళదుంప -31.54 శాతం ఉండగా, ఇప్పుడు 39.38 శాతం ఉంది.
ఆహార ద్రవ్యోల్బణానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా? : సీతారాం ఏచూరి
ఆహార ద్రవ్యోల్బణానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా? అని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రశ్నించారు. ధరలు పెరుగుదలపై గురువారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. దేశంలో నిరుద్యోగ రేటు 42 శాతం ఉందని, కార్మిక భాగస్వామ్యం రేటు 38.8 శాతానికి తగ్గిందని అన్నారు. అంటే 61.2 శాతం ఉద్యోగాలు లేనందున ఉపాధి కోసం వెతకడం మానేశారని తెలిపారు. ఇప్పుడు ఆహార ద్రవ్యోల్బణం పెరిగిందని అన్నారు. దీంతో జీవనో పాధిని, భవిష్యత్తును నాశనం చేసేందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా? అని ఎద్దేవా చేశారు.