Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇటీవల జరిగిన 'పాంచజన్య' సదస్సుకు పీఎస్‌యూల నుంచి నిధులు
- ఢిల్లీలోని ఏడు నక్షత్రాల హోటల్లో అంగరంగ వైభవంగా సదస్సు
- పీఎస్యూలో స్వతంత్ర డైరెక్టర్ల హవా!
- ఎన్ఎండీసీ, ఎన్హెచ్ఏఐ, హెచ్‌సీఎల్, నమామి గంగే..నుంచి నిధులు తరలింపు
న్యూఢిల్లీ : చీమలు ఎంతో కష్టపడి పుట్టలు నిర్మించుకుంటాయి. వాటిని పాములు ఆక్రమిస్తాయి. ఇప్పుడు మనదేశంలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల (పీఎస్‌యూ)ల పరిస్థితి కూడా అలాంటిదే. పీఎస్‌యూల్లో స్వతంత్ర డైరెక్టర్లుగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకుల్ని, కార్యకర్తల్ని మోడీ సర్కార్ నియమించి..అంతా తమ ఇష్టారాజ్యంగా మార్చింది. దాంతో పీఎస్‌యూలను తమ జేబు సంస్థలుగా ఆర్ఎస్ఎస్, బీజేపీ వాడేసుకుంటున్నాయి. ఢిల్లీలో ఇటీవల జరిగిన ఆర్ఎస్ఎస్ వారపత్రిక 'పాంచజన్య' సదస్సే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఢిల్లీలోని అత్యంత ఖరీదు అయిన ఏడు నక్షత్రాల హోటల్ 'లె మెరేడియన్'లో పాంచజన్య సదస్సును ఆర్ఎస్ఎస్ నిర్వహించింది. దేశం నలుమూలల నుంచి హాజరైన ఆర్ఎస్ఎస్, బీజేపీ కీలక నేతలు సదస్సు జరిగిన తీరు చూసి నివ్వెరపోయారు. నగరంలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద హోర్డింగ్స్, ఫ్లెక్సీలు కనపడ్డాయి. సదస్సు జరిగి నెలరోజులైనా వాటిని తొలగించలేదు. హోర్డింగ్స్, ఫ్లెక్సీల ప్రదర్శనకు ఇన్ని రోజులపాటు అయిన ఖర్చు తక్కువేమీ కాదు. మరి ఇదంతా కూడా ఆర్ఎస్ఎస్, బీజేపీ స్వంత నిధుల నుంచి చేసిన ఖర్చు అనుకుంటే పొరబడినట్టే.
వాళ్ల ఇష్టారాజ్యం
పాంచజన్య నిర్వహించిన భారీ సదస్సుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి నిధులు వెళ్లాయని విశ్వసనీయ సమాచారం. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, నమామి గంగే, వాప్కోస్...మొదలైన సంస్థలు తమ 'సీఎస్ఆర్' (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబిలిటీ) నిధుల నుంచి పాంచజన్య సదుస్సుకు అందజేశాయని తెలిసింది. మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చింది మొదలు ప్రభుత్వరంగ సంస్థల్ని టార్గెట్ చేస్తున్నాయి. ఆ సంస్థల్లో కీలకస్థానాల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ మద్దతుదారుల్ని నియమిస్తోంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా తమ వాళ్లనే నియమించుకుంటూ ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తోంది. పాంచజన్య నిర్వహించిన ఒక ప్రయివేటు కార్యక్రమానికి పెద్ద మొత్తంలో నిధులు మళ్లడానికి కారణం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సేనని జాతీయ ఆంగ్ల పత్రిక ఒకటి వార్తా కథనం వెలువరించింది.
అంతా బీజేపీ వాళ్లే
మహారత్న, నవరత్న, మినీ రత్న హోదా కలిగిన ప్రభుత్వరంగ సంస్థల యూనిట్లు దేశవ్యాప్తంగా 172వరకు ఉన్నాయి. ఇందులో 86 యూనిట్లలో బీజేపీకి చెందిన వ్యక్తుల్ని స్వతంత్ర డైరెక్టర్లుగా మోడీ సర్కార్ నియమించింది. కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన ఈ యూనిట్ల కార్యకలాపాల్ని బీజేపీ మద్దతుదారులు ప్రభావితం చేస్తున్నారు. దుష్ట రాజకీయ ప్రయోజనాలకు సంస్థల నిధుల్ని అక్రమంగా ఉపయోగిస్తున్నారని 'ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్' గత ఏడాది సంచలన వార్తా కథనం వెలువరించింది.
ఎక్కడెక్కడీ
ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ నాయకుడు మనీశ్ కపూర్‌ను 'భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్'లో డిప్యూటీ ట్రెజరర్‌గా కేంద్రం నియమించింది. దీంట్లోనే బీజేపీ మాజీ జాతీయ కన్వీనర్ రాజేశ్ శర్మ (యూపీ) స్వతంత్ర డైరెక్టర్‌గా 2019లో నియమితుడయ్యాడు.
బీజేపీ కార్యకర్త రాజ్‌కమల్ స్వతంత్ర డైరెక్టర్‌గా 2020 నుంచి పనిచేస్తున్నాడు. గోవా అసెంబ్లీ మాజీ స్పీకర్, మాజీ మంత్రి రాజేంద్ర ఆర్లేకర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో చేరారు. ఛత్తీస్‌గఢ్ బీజేపీ ఉపాధ్యక్షుడు లతా ఉసెండీకి కీలక స్థానం అప్పజె ప్పారు. కర్నాటక బీజేపీకి చెందిన ఎన్.శంకరప్పను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో స్వతంత్ర డైరెక్టరగా పనిచేస్తున్నారు. ఇలా కొన్ని వందల మంది బీజేపీ, ఆర్ఎస్ఎస్ మద్దతుదారులు, నాయకులు ప్రభుత్వరంగ సంస్థల్లో స్వతంత్ర డైరెక్టర్లుగా, ఇతర హోదాలో నియమితులయ్యారు. వారి సహకారం, మద్దతుతోనే ఇటీవల పాంచజన్యం సదస్సు జరిగిందని తెలుస్తోంది. సదస్సు నిర్వహణకు అయిన ఖర్చు అంతా కూడా ప్రభుత్వరంగ సంస్థలదే.