Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచవ్యాప్తంగా 146 దేశాలలో 135వ స్థానంలో భారత్
- బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్‌ల కంటే వెనక
- 'ఆరోగ్యం-మనుగడ' సూచీలో 146వ ర్యాంకు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ జెండర్ గ్యాప్ రిపోర్టు
న్యూఢిల్లీ : మోడీ పాలనలో మహిళకు తగిన గౌరవం దక్కటం లేదు. ఎప్పటిలాగే భారత్ మరోసారి లింగ సమానత్వ సూచీలో వెనకబడింది. కేంద్రం అనుసరిస్తున్న తిరోగమన విధానాలతో ఇతర అంశాల్లోనూ దారుణ ప్రదర్శనను కనబర్చింది. మన కంటే చిన్న దేశాలు, పొరుగు దేశాల కంటే వెనకబడిన భారత్ అట్టడుగు జాబితాలో నిలిచింది. లింగ సమానత్వంలో ప్రపంచవ్యాప్తంగా 146 దేశాలకు గానూ భారత్ 135వ ర్యాంకులో ఉన్నది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 'జెండర్ గ్యాప్ రిపోర్టు 2022'లో ఈ విషయం వెల్లడైంది. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌ను ముఖ్యంగా నాలుగు అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు. ఆర్థిక భాగస్వామ్యం, అవకాశం, విద్యా సాధన, ఆరోగ్యం-మనుగడ, రాజకీయ సాధికారత అంశాల ఆధారంగా సున్నా నుంచి 100 వరకు స్కోరును కేటాయిస్తారు. 0 నుంచి 1 వరకు భారత్ 0.629 స్కోరును సాధించింది. మన తర్వాత మరో 11 దేశాలు మాత్రమే ఉండటం గమనించాల్సిన అంశం. మన కంటే చిన్న ఆర్థిక వ్యవస్థ కలిగిన పొరుగు దేశాలు బంగ్లాదేశ్ (71), నేపాల్ (96), శ్రీలంక (110), మాల్దీవులు (117), భూటాన్ (126)లు భారత్ కంటే ముందు స్థానాల్లో నిలవటం గమనార్హం.
ఐస్లాండ్ ఫస్ట్.. 90 శాతం లింగ సమానత్వం
ప్రస్తుత రిపోర్టు ప్రకారం.. ఐస్లాండ్ మొదటిస్థానంలో నిలిచింది. ఇది 90 శాతం కంటే ఎక్కువ లింగ సమానత్వాన్ని నమోదు చేసింది. ఇంత మొత్తంలో లింగ సమానత్వాన్ని సాధించి ఏకైక దేశంగా నిలిచింది. తర్వాతి స్థానాల్లో ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్ దేశాలున్నాయి. ఆఫ్రికా దేశాలైన రువాండా ఆరో స్థానంలో, నమీబియా 8వ స్థానంలో ఉన్నాయి. నికరాగ్వే ఏడో స్థానం, ఐర్లాండ్, జర్మనీ 9, 10వ స్థానాల్లో నిలిచాయి. లింగ సమానత్వంలో మరింత దారుణంగా ఉన్న టాప్-5 దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, కాంగో, ఇరాన్, చాద్ లు ఉన్నాయి.
లింగ సమానత్వానికి 197 ఏండ్లు..!
లింగ సమానత్వం సాధించాలంటే 132 ఏండ్లు పడుతుంది. గతేడాది ఇది 136 ఏండ్లుగా అంచనా వేయబడింది. ఇప్పుడు నాలుగు స్థానాలు మెరుగు పడింది. ఇక పేలవ ప్రదర్శన కనబర్చిన దక్షిణాసియా.. లింగ సమానత్వాన్ని సాధించాలంటే 197 సంవత్సరాలు పడుతుంది. 2021లో 156 దేశాలకు గానూ భారత్ 140వ స్థానంలో ఉన్నది.
ఆరోగ్య-మనుగడ ఉపసూచీలోనూ వెనకే
ఆరోగ్య-మనుగడ ఉపసూచీలోనూ చెత్త ప్రదర్శనను కనబర్చింది. ఇందులో భారత్ 146వ స్థానంలో ఉన్నది. ఇది అన్ని నాలుగు ఉపసూచీల్లో తక్కువ ర్యాంకు కావటం గమనార్హం. ఈ విషయంలో మనకంటే చిన్న దేశాలైన నేపాల్ (109), భూటాన్ (125), బంగ్లాదేశ్ (129), ఆఫ్ఘనిస్తాన్ (140), పాకిస్తాన్ (143) లు ముందు స్థానాల్లో ఉన్నాయి. ఇందులో దక్షిణాసియా అతి తక్కువ ప్రాంతీయ లింగ సమాన స్కోరులను కలిగి ఉన్నది. ఇందులో శ్రీలంక లింగ అంతరాన్ని తగ్గించింది. భారత్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లు ప్రపంచవ్యాప్తంగా అధ్వాన్నంగా పని చేస్తున్న దేశాల్లో ఉన్నాయి. రాజకీయ సాధికారత ఉప సూచీలో భారత్ 48వ స్థానంలో ఉన్నది. దక్షిణాసియాలోని నేపాల్, బంగ్లాదేశ్, భారత్‌లో వృత్తిపరమైన, సాంకేతిక పాత్రలలో మహిళల వాటాలో పెరుగుదల ఎక్కువగా ఉన్నది. ఇరాన్ ప్రదర్శన దారుణంగా ఉన్నది.
అలాగే, ఆర్థిక భాగస్వామ్యం-అవకాశం ఉపసూచీలోనూ భారత్ చాలా పేలవ ప్రదర్శనను చూపింది. భారత్ 143వ స్థానంలో ఉన్నది. నేపాల్ (98), భూటాన్ (126), బంగ్లాదేశ్ (141) వంటి దేశాల కంటే భారత్ వెనకబడటం ఆందోళనకరం. విద్యా సాధనలో భారత్ 107వ స్థానంలో నిలిచింది. మహిళా సాధికారత కోసం ఎన్నో పథకాలను ప్రవేశ పెడుతున్నామనీ, 'బేటీ బచావో-బేటీ పడావో', ఉజ్వల యోజన వంటి స్కీమ్‌లతో వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని చెప్పుకుంటున్న మోడీ ప్రభుత్వం.. ప్రస్తుత నివేదిక సమాచారానికి ఏం సమాధానమిస్తుందని మహిళ సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు ప్రశ్నించారు. లింగ అంతరాన్ని రూపుమాపాలన్న చిత్తశుద్ధి మోడీ ప్రభుత్వానికి లేదని ఆందోళన వ్యక్తం చేశారు.