Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధర్నాలు, ప్రదర్శన, నిరాహార దీక్షలు చేయకూడదు..
- రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీ బుటెటిన్ విడుదల
- ప్రతిపక్షాల ఆగ్రహం
న్యూఢిల్లీ : పదాల నిషేధంపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తుండగా.. మరోవైపు రాజ్యసభ సెక్రటరీ జనరల్ తాజా బులెటిన్ వర్షాకాల సమావేశాలను ముందుగానే వేడెక్కించేలా ఉన్నాయి. 'పార్లమెంటు ప్రాంగణాన్ని ధర్నా, నిరాహార దీక్ష, ప్రదర్శన, ఏదైనా మతపరమైన కార్యక్రమాల నిమిత్తం వినియోగించుకోకూడదు. ఈ కొత్త నిబంధనకు సభ్యులంతా సహకరించాలి' అంటూ రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీ బులెటిన్ విడుదల చేశారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. పార్లమెంటులో కొన్ని పదాలు వినియోగించకూడదని ఇటీవలే జారీ అయిన నోటీసులపై ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న ప్రతిపక్షాలు.. ఇప్పుడు ప్రభుత్వ తాజా ప్రకటనపై తీవ్ర నిరసన వ్యక్తంచేస్తున్నాయి. ప్రజాస్వామ్య విలువలను అధికార ప్రభుత్వం నాశనం చేస్తోందని విమర్శిస్తున్నారు. ప్రభుత్వ విధానాలు, చర్యలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పార్లమెంట్లో నిరసనలు చేపట్టడం సాధారణమే. పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలో ఉభయ సభల్లో ప్రజా సమస్యలపై ప్రతిపక్షాల ఆందోళనలు ఇంకా ఎక్కువగానే ఉంటాయి. వాటి నియంత్రించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. జులై 18 (సోమవారం) నుంచి వర్షాకాలం సమావేశాలు ప్రారంభం కానుండటం గమనార్హం.
హక్కు ఉల్లంఘనే : ప్రతిపక్షాలు
పార్లమెంట్లో ఆందోళనలను నిషేధించడం ఎంపీల హక్కు ఉల్లంఘనేనని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. 'ప్రజాస్వామ్యాన్ని, దాని స్వరాన్ని మంటగలిపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంత పిరికితనమా? ఇలాంటి నియంతృత్వ ఆదేశాలు జారీ చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో నిరసన తెలపడాన్ని నిషేదించడంతో ఎంపీల రాజకీయ హక్కు ఉల్లంఘించబడుతోంది' అన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ స్పందిస్తూ... 'విశ్వ గురు నుంచి మరో కొత్త ఆయుధం వచ్చింది. ఇక ధర్నాలపైనా నిషేధమా? ఇదేం పాలన' అని పేర్కొన్నారు. వారణాసి ఎంపీ, ప్రధాన మంత్రి మోడీ నాలుగు రోజుల క్రితమే మతపరమైన వేడుక నిర్వహించారని టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా అన్నారు.
లోక్‌సభలో ఎలాంటి సర్కులర్ జారీ చేయలేదు : స్పీకర్ ఓం బిర్లా
లోక్‌సభలో ఎలాంటి సర్క్యులర్ జారీ చేయబడలేదని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. అయితే ఇది 2009 నుంచి, అంతకు ముందు కూడా కొనసాగుతున్న ప్రక్రియని చెప్పారు.