Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాక్ స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణ చచ్చిపోయింది : రాజకీయ విశ్లేషకులు
- ప్రధానిపై ఒక హోర్డింగ్ పెట్టినందుకు యూపీలో ఐదుగురు అరెస్టు
- యోగిపై అభ్యంతరకర పోస్టు పెట్టాడని 18ఏండ్ల విద్యార్థి నిర్బంధం
- తీవ్రమైన నేరారోపణలతో కూడిన సెక్షన్ల కింద కేసులు నమోదు
న్యూఢిల్లీ : అధిక ధరలు, నిరుద్యోగం, ఇంధనంపై పన్నులతో కేంద్రం భారాలు మోపినా..ప్రజలు కిమ్మనకుండా అన్నీ భరించాలని మోడీ సర్కార్ భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వ విధానాల్ని విమర్శించినా, ప్రధాని మోడీని తప్పుబట్టినా.. క్రిమినల్ కేసులు పెడుతూ వేధింపులకు దిగుతోంది. ప్రస్తుత పరిణామాలు చూస్తే ఈ దేశంలో వాక్ స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణ కేవలం కాగితాలకే పరిమితమని అర్థమవుతోంది. దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ వ్యవహారశైలి ఇప్పుడు జాతీయ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆ రాష్ట్రంలోని కల్నల్‌గంజ్‌లో ప్రధాని మోడీ తీరును విమర్శిస్తూ ఒక హోర్డింగ్ వెలిసింది. వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.1105కు పెంచినందుకు, సాగు చట్టాలు, యువత ఉద్యోగాల్ని ప్రస్తావిస్తూ..బై బై మోడీ..అంటూ ఆ హోర్డింగ్‌ను తయారుచేశారు. ప్రయాగ్ రాజ్‌లోని కల్నల్‌గంజ్ పోలీసులు ఈ హోర్డింగ్‌పై కేసు నమోదుచేసి, ఐదుగుర్ని అరెస్టు చేశారు. వారిపై సెక్షన్ 153బి (దూషించినందుకు, దేశ ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారని), సెక్షన్ 505(2) (రెండు వర్గాల మధ్య విద్వేషాన్ని రేపినందుకు) కింద క్రిమినల్ ఆరోపణలు నమోదుచేశారు. ప్రభుత్వాన్ని, పాలకుల్ని విమర్శిస్తే పై సెక్షన్ల కింద కేసులు నమోదుచేయటమేంటని హక్కుల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టాలకు వక్రభాష్యాలు చెబుతూ, ఇష్టారీతిగా అరెస్టుల పర్వానికి యోగి సర్కార్ తెరలేపిందని వారు అన్నారు. ఈ కేసులో విచిత్రం ఏంటంటే, హోర్డింగ్‌ను ప్రింట్ చేసిన యజమానిని సైతం పోలీసులు తీసుకొచ్చి స్టేషన్లో నిర్బంధించటం. ఇలాంటిదే మరో కేసు..ఒక 18ఏండ్ల యువకుడిపై యోగి సర్కార్ క్రిమినల్ ఆరోపణలు నమోదుచేసింది. ట్విట్టర్లో సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై అభ్యంతరకర పోస్టు పెట్టాడని కనౌజ్‌కు చెందిన విద్యార్థి ఆశిష్ యాదవ్‌ను అరెస్టు చేశారు. దీంట్లోనూ యూపీ పోలీసులు యాదవ్‌పై ఐపీసీలోని సెక్షన్ 153(బి), సెక్షన్ 505(2)తో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 153ఎ, 295ఏ వంటివీ నమోదుచేశారు. కనౌజ్ జిల్లా కలెక్టర్ రాకేశ్ కుమార్, జిల్లా ఎస్పీ రాజేశ్ కుమార్ శ్రీవాస్తవ స్వయంగా రంగంలోకి దిగి, ఆశిష్ యాదవ్‌ను పోలీస్ స్టేషన్లో విచారించారట.
బెయిల్ రాని సెక్షన్లు
ఇలాంటి ఘటనలు యూపీలో సర్వసాధారణంగా మారాయి. యోగి ఆదిత్యనాథ్‌ను ఆదర్శంగా తీసుకొని ఇతర బీజేపీ సీఎంలు సైతం తమ తమ రాష్ట్రాల్లో నిరసన గళాన్ని అణచివేయడానికి సిద్ధమవుతున్నారు. కోర్టులు బెయిల్‌కు నిరాకరించే సెక్షన్లు ఎంచుకొని పోలీసులు కేసులు నమోదుచేయటం..పాలకుల ఉద్దేశాన్ని తెలుపుతోంది. నిందితులు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్‌పై బయటకు రాకూడదనే ఉద్దేశంతో జైల్లో నిర్బంధిస్తున్నారు. వాక్ స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణ..మనదేశంలో చచ్చిపోయిందని, పాలకులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. సుప్రీంకోర్టు సైతం కలుగజేసుకొని (రాజద్రోహం కేసులో ఇటీవల) ఒక స్పష్టత ఇచ్చినా, మోడీ సర్కార్ తీరులో మార్పు రావటం లేదు. జర్నలిస్టు మహమ్మద్ జుబైర్ అరెస్టుపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. పాలకుల విధానాల్ని విమర్శిస్తూ ట్విట్టర్లో పోస్టు పెట్టినందుకు జుబైర్‌పై ఒక కేసు నమోదైంది. దీనిని కొట్టేస్తూ సెషన్స్ జడ్జీ బెయిల్ మంజూరు చేశాడు. ఒక కేసు కాకపోతే మరో కేసు..అని, జుబైర్‌పై మూడు కేసులు పెట్టారు. ఇలా అటు న్యాయవ్యవస్థను, ఇటు శాసనవ్యవస్థను మోడీ సర్కార్ దుర్వినియోగం చేస్తున్నతీరు ప్రజలందరికీ స్పష్టంగా కనపడుతోంది.