Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదే రోజు ఉపరాష్ట్రపతి ఎన్నికలపై ప్రతిపక్షాల సమావేశం
- సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు
- రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో రేపు (ఆదివారం) ఉదయం అఖిలపక్ష సమావేశం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం అదే రోజు మధ్యాహ్నం ప్రతిపక్షాలు భేటీ కానున్నాయి. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రతి ఐదేండ్లకోసారి జరిగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే జరుగుతుండటం గమనార్హం.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్యనాయుడు కూడా ఆయా సభల ఫ్లోర్ లీడర్లతో సమావేశం కానున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శనివారం సాయంత్రం 4 గంటలకు ఫ్లోర్ లీడర్ల సమావేశాన్ని ఏర్పాటుచేయగా, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ఆదివారం వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశం కానున్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన సాయుధ దళాల రిక్రూట్మెంట్ స్కీమ్ అగ్నిపథ్‌పై ప్రతిపక్షాల నిలదీయనున్నాయి. ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. వంట గ్యాస్ ధర పెరుగుదల, రూపాయి పతనం, ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రయివేటీకరణ వంటి అంశాలను లేవనెత్తనున్నాయి. అలాగే ఫెడరలిజం, ఇండియా-చైనా సరిహద్దు సమస్య, ద్రవ్యోల్బణం సమస్యలను నిలదీయనున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాలు కరోనా (కోవిడ్-19) ప్రోటోకాల్ ప్రకారం జరుగుతాయి. భౌతిక దూర నిబంధనలను నిర్వహించడానికి సభ్యులకు సందర్శకుల గ్యాలరీని కూడా కేటాయించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 18న ప్రారంభమై ఆగస్టు 12 వరకు జరుగుతాయి.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక
జూలై 18న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజున రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఆగస్టు 10న పదవీకాలం ముగియనున్న ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడుకు ఇది చివరి సెషన్. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక ఆగస్టు 6న జరగనున్నది. ఇప్పటి వరకు అధికార బీజేపీ, ప్రతిపక్షాలు తమ అభ్యర్థులను ప్రకటించలేదు.