Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పార్లమెంట్ భవన్ ఆవరణలో ఎంపీలు ఎలాంటి నిరసన చర్యలు నిర్వహించరాదని పేర్కొంటూ ప్రభుత్వం జారీచేసిన నిరంకుశ ఆదేశాలను సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. దేశానికి, ప్రజలకు సంబంధించిన అన్ని కీలకమైన అంశాలపై తమ అభిప్రాయాన్ని చెప్పడానికి ఎంపీలు సాధారణంగా నిరసన కార్యాచరణ చేపడుతూ ఉంటారు. భారత పార్లమెంట్ ప్రారంభమైనప్పటి నుంచి ఇది వారి ప్రజాస్వామ్య హక్కుగా వుందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదలచేసింది. పార్లమెంట్లో ఉపయోగించకూడని పదాల జాబితాను పెంచుకుంటూ కొత్తగా ఆదేశాలు జారీ చేయడంతో పాటు, నిరసనలను నిషేధిస్తూ తీసుకొచ్చిన ఉత్తర్వులు పార్లమెంట్‌పై జరిగిన అత్యంత దారుణమైన నిరంకుశ దాడి అని సీపీఐ(ఎం) పేర్కొంది. అంతేకాదు, పార్లమెంట్ స్వతంత్ర పనితీరుపైన, పార్లమెంట్ సభ్యుల నుంచి విడదీయలేని హక్కులపైన జరిగిన దాడిగా చూడాలంది. ప్రభుత్వం 'అసమర్థంగా' వ్యవహరిస్తోందని చాలా తరచుగా వ్యాఖ్యానిస్తూ వుంటాం. ఇప్పుడు ఆ అసమర్థత అనే పదం కూడా ఉపయోగించకూడని పదమై పోయిందని పేర్కొంది. పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్టీలను సంప్రదించకుండా, ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా అప్రజాస్వామికం. పైగా పార్లమెంట్ సమావేశాల ప్రారంభ సందర్భంగా ఈ చర్య తీసుకోవడం మరీ దారుణం. ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.