Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంజాబ్లోని బటిండాలో ఘటన
చండీగఢ్: పంజాబ్లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలి యని దుండగులు ధ్వంసం చేశారు. బటిండాలోని పబ్లిక్ పార్క్లో ఈ ఘటన చోటు చేసుకున్నది. కాగా, నిందితులను గుర్తించటానికి అక్కడి ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నామని పంజాబ్ పోలీసులు తెలిపారు. విగ్రహ ధ్వంసం కేసులో ఇక్కడి రమ్మన్ మండి పోలీసు స్టేషన్లో కేసు నమోదైందని స్టేషన్ హౌజ్ ఆఫీసర్ (సదర్) హర్జోత్ సింగ్ మన్ చెప్పారు. ఈ ఘటనపై పంజాబ్ కాంగ్రెస్ యూనిట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఆమోదయోగ్యమైన చర్య కాదని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ అమరీందర్ సింగ్ రాజా హెచ్చరించారు. నిందితులను పట్టుకొని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కెనడాలోని ఒంటారియో నగరంలో గల ఒక హిందూ ఆల యం వద్ద గాంధీ విగ్రహం ధ్వంసమైన కొన్ని రోజులకే పంజాబ్లో ఈ ఘటన చోటు చేసుకోవటం గమనార్హం. ఈ ఘటనపై భారత్ ఇప్పటికే సీరియస్ అయింది. కాగా, భారత్ వెలుపల గాంధీ విగ్రహం ధ్వంసమైన కేసులు గత రెండేండ్లలో లండన్, వాషింగ్టన్, కాలిఫోర్నియాలోని డేవిస్ సిటీలో చోటు చేసుకున్నాయి.