Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మజ్జిగ.. అప్పడాలు.. ఎల్ఈడీ బుగ్గలపై బాదుడు
- స్మశాన వాటిక పనులపైనా పన్నులు
- రేపటి నుంచే అమల్లోకి..
న్యూఢిల్లీ : అధిక ధరలతో ఇప్పటికే బెంబేలెత్తుతున్న ప్రజలపై సోమవారం నుంచి మరిన్ని భారాలు పడనున్నాయి. బడి పిల్లలు పెన్సిళ్లు చెక్కుకునే షార్ప్నర్ల నుంచి స్మశాన వాటికల్లో జరిగే కాంట్రాక్టు పనులపై పన్నులు పెరగనున్నాయి. గత నెలలో చంఢగీడ్లో జరిగిన 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు ఉత్పత్తులపై కొత్తగా పన్నులు వేయగా.. మరికొన్నిటిపై పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పెంచిన పన్నులు జులై 18 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటి వరకు ప్యాక్ చేసిన పెరుగు, మజ్జిగ, పన్నీరు, లస్సీ, గోదుమలు, మొక్కజొన్న తదితర వాటిపై పన్నులు వేయలేదు. ఈ ఉత్పత్తులపై ఇకపై 5 శాతం పన్ను రేటు అమల్లోకి రానుంది. గోధుమ పిండి, అప్పడాలు, చేపలు, తేనే, ఎండు చిక్కుళ్లు పైనా పన్నులు వేయనున్నారు. క్షౌరశాల బ్లేడ్లు, పేపరు కత్తులు, పెన్సిల్ చెక్కుకునే షార్ప్నర్లు, ప్రింటింగ్ ఉత్పత్తులపై ఇప్పటి వరకు 12 శాతం పన్ను రేటు ఉండగా.. ఇకపై 18 శాతానికి చేరనున్నాయి. సోలార్ వాటర్ హీటర్లు, ఎల్ఇడి లైట్లు, చెంచాలు (స్పూన్లు), ప్రింటింగ్ ఇంక్ తదితర వాటిపై ఇప్పటి వరకు 12 శాతంగా ఉన్న పన్నును 18 శాతానికి చేర్చారు. తోలు ఆధారిత ఉత్పత్తులు, బ్యాంక్లు జారీ చేసే చెక్కులపై 18 శాతం, ముద్రించిన పటాలు, చార్ట్లు, అట్లాస్లపై 12 శాతం పన్ను రేట్లు అమల్లోకి రానున్నాయి. ఇకపై హోటళ్లలో రూ.1,000 లోబడిన గదులపై కూడా 12 శాతం జిఎస్టి వేయనున్నారు. విద్యుత్ పంపులు, సైకిళ్లలో గాలి నింపుకునే పంపులు, డెయిరీ యంత్రాలపై 18 శాతం పన్నులు పడనున్నాయి. చివరకు శ్మశాన వాటికల కాంట్రాక్టు పనులపై కూడా జీఎస్టీని 12 శాతం నుంచి 18 శాతానికి చేర్చడం గమనార్హం. ఇప్పటికే అధిక ద్రవ్యోల్బణంతో ప్రజల పొదుపు, కొనుగోలు శక్తి హరించుకుపోతోంది.. కొత్తగా మరిన్ని భారాలు వేయడం ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.