Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ సవరణ బిల్లు-2022ను సిద్ధం చేసిన కేంద్రం
- సబ్సిడీలకు కోత..రాష్ట్రాలను దెబ్బకొట్టడమే వ్యూహం!
- దీనికి మేం వ్యతిరేకం : కార్మికులు, ఉద్యోగులు
న్యూఢిల్లీ : సాగు చట్టాలు, లేబర్ కోడ్స్..ఎందుకు వచ్చాయో దేశం యావత్తు చూసింది. ఇప్పుడు మరో వివాదాస్పద బిల్లును మోడీ సర్కార్ తీసుకురాబోతోంది. విద్యుత్ సవరణ బిల్లు, 2022ను రాష్ట్రాల మీద రుద్దడానికి సర్వం సిద్ధం చేసింది. ఈ బిల్లులో ప్రధాన అంశం..విద్యుత్ పంపిణీ ప్రయివేటీకరించటం. క్షేత్రస్థాయిలో వినియోగదా రులకు ప్రయివేటు డిస్కాంలు కనెక్షన్లు ఇస్తాయి. విద్యుత్‌ను అమ్ముతాయి. దీనిని రాష్ట్రాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు బిల్లుకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. ఇంత జరుగుతున్నా.. కేంద్రం మాత్రం ఏకపక్షంగా ముందుకువెళ్తోంది. అందరితో చర్చించాం, వారు సూచించిన మార్పులు చేశాం..అంటూ కేంద్రం తన చర్యల్ని సమర్థించుకుంటోంది.
విద్యుత్ సంస్కరణల పేరిట కేంద్రం చేస్తున్న చట్ట సవరణ అంతా ఏకపక్షమని, ఈ బిల్లుపై ఎవరితో మాట్లాడకున్నా..మాట్లాడమని అబద్ధాలు ప్రచారం చేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బిల్లులో అత్యంత ప్రమాదకర అంశాలున్నాయని విద్యుత్‌రంగ నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. ఈ బిల్లుతో మంచికన్నా చెడే ఎక్కువగా జరుగుతుందని వారు చెబుతున్నారు. కేంద్ర విద్యుత్ శాఖ వెబ్సైట్లో ఇప్పటివరకూ ఆ బిల్లు సమాచారాన్ని పొందుపర్చలేదని, భాగస్వామ్య పక్షాల సలహాలు, సూచనలు తీసుకోలేదని నిపుణులు అన్నారు. విద్యుత్ చట్టం, 2003ను సవరించే ముందు రాష్ట్రాలతో, ఉద్యోగులు, వినియోగదారులతో చర్చించాలని, అదంతా కూడా బహిరంగపర్చాలని నిపుణులు డిమాండ్ చేశారు. ముసాయిదా బిల్లును పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమీక్షకు పంపాలని సూచించారు.
దేశ ప్రయోజనాలూ దెబ్బతింటాయి
ఇంత హడావిడిగా విద్యుత్ సవరణ బిల్లును తీసుకురావాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. విద్యుత్‌రంగంపై బడా వ్యాపారవేత్తలు, కార్పొరేట్ల కన్ను పడిందని, వారి కోసం మోడీ సర్కార్ ఆరాటపడుతోందని విమర్శించారు. బిల్లులోని అంశాలన్నీ బడా వ్యాపారులకు ఉద్దేశించినవే ఉన్నాయన్నారు. విద్యుత్ రంగం..కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలో ఉంది. రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తూ బిల్లులో కేంద్రం అనేక క్లాజులు రూపొందొంచింది. దీని ప్రకారం రాష్ట్రాలపై ఆర్థికభారం పెరగనున్నది. ఇదంతా కూడా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ప్రజల డబ్బుతో నిర్మించినవి..
వంటగ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీకి మోడీ సర్కార్ మంగ ళం పాడింది. అలాగే విద్యుత్ వినియోగదారులకు ఇప్పుడు ప్రభుత్వ డిస్కాంలు ఇస్తున్న సబ్సిడీలను కూడా తొలగించా లన్నదే కేంద్రం ఎత్తుగడ. ప్రయివేటు కంపెనీలు రంగ ప్రవేశం చేశాక, కార్మికులు, ఉద్యోగుల ప్రయోజనాలు సైతం దెబ్బతినే అవకాశముంది. విద్యుత్ మౌలిక వసతుల కల్పనకు ఆయా రాష్ట్రాలు రూ.లక్షల కోట్లు ఖర్చు చేశాయి. ఇదంతా కూడా ప్రజల డబ్బుతో ఏర్పాటైంది. మౌలిక వసతులు ..ప్రయివేటు కంపెనీలు వాడుకోవటమేంటి? మెల్ల మెల్లగా అదంతా కూడా ప్రయివేటు పరం కాదన్న నమ్మక మేంది? ఉదాహరణకు జూన్ నెల విద్యుత్ బిల్లు చెల్లింపు గడువు, వినియోగదారుడికి జులైలో 21 వరకు ఉంది. కొత్త చట్టం ప్రకారం..ప్రీపెయిడ్ చేస్తేనే సరఫరా ఉంటుంది. కార్పొరేట్లు అమ్ముతున్న సోలార్ విద్యుత్‌ను రాష్ట్రాలు కచ్చితంగా కొనుగోలు చేయాల్సి వుంటుంది. రాష్ట్రాల్లో విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్స్ కనుమరుగు అవుతాయి.
ప్రత్యేక బాక్స్‌లో..
ముంబయి సబర్బన్ ప్రాంతంలో టాటా, అదానీ కంపెనీలకు విద్యుత్ పంపిణీ లైసెన్స్‌లు ఇచ్చారు. ప్రయివేటుకు అవకాశమిచ్చాం, నాణ్యమైన విద్యుత్ తక్కువ రేటుకు అందుబాటులోకి తీసుకొచ్చామని మొదట్లో ప్రచారం చేశారు. ఇప్పుడు దేశంలోనే అత్యధిక టారీఫ్తో కూడిన విద్యుత్‌ను టాటా, అదానీ కంపెనీలు వినియోగ దారులకు అమ్ముతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో లాభపడింది బడా కార్పొరేట్లు. మోసపోయింది సామాన్య ప్రజలు. విద్యుత్ సవరణ బిల్లు-2022 చట్టరూపం దాల్చితే దేశమంతా అదే జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.