Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 లక్షల బిపిఎల్ కుటుంబాలకు ఉచిత ఇంటర్నెట్
తిరువనంతపురం : 20 లక్షల బిపిఎల్ కుటుంబాలకు ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్లను అందించడం, ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ని ఉపయోగించి అన్ని ప్రభుత్వ సంస్థలను కనెక్ట్ చేయడం లక్ష్యంగా కేరళలోని ఎల్డిఎఫ్ ప్రభుత్వం కె-ఫోన్ ప్రాజెక్టును ప్రారంభించింది. ప్రజలకు తక్కువ ధరలు, అధిక నాణ్యత హై స్పీడ్ ఇంటర్నెట్ అందించడానికి ఎల్డిఎఫ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ముందుకుతెచ్చింది. ఇంటర్నెట్ ప్రజల హక్కుగా ప్రకటించి, బిపిఎల్ కుటుంబాలకు ఉచితంగా, ఇతరులకు తక్కువ ధరకు ఇంటర్నెట్ సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ఐఎస్ పి) కేటగిరీ బి యూనిఫైడ్ లైసెన్స్‌ను కేంద్రం నుంచి పొందడం ద్వారా కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్ వర్క్ లిమిటెడ్ (కె-ఫోన్) కేరళ రాష్ట్ర పరిధిలో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు అనుమతి లభించింది. దీంతో సొంత ఐఎస్పి లైసెన్స్, ఇంటర్నెట్ ప్లాన్ ఉన్న రాష్ట్రంగా కేరళ అవతరించింది. మొదటి దశగా మౌలిక సదుపాయాల ప్రొవైడర్ కేటగిరీ 1 లైసెన్స్‌ను కేంద్రం గత వారం ఆమోదించింది. సుమారు 30 వేల ప్రభుత్వ కార్యాలయాల్లో కె-ఫోన్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు చర్యలు పూర్తయ్యాయి. చివరి రౌండ్ సన్నాహాల తర్వాత ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో, ప్రభుత్వ సేవలు పేపర్ లెస్‌గా మారడం వేగవంతం కానుంది. టెలికాం రంగంలో కార్పొరేట్ ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా ఈ ప్రాజెక్టు నిలువనుంది.