Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయం
న్యూఢిల్లీ : ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మద్దతు ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం నిర్ణయం తీసుకుంది. సమావేశం అనంతరం రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, ఎంపీ సంజరు సింగ్ మీడియాతో మాట్లాడారు. 'ద్రౌపది ముర్ము పట్ల మాకు గౌరవం ఉంది. కానీ యశ్వంత్ సిన్హాకు మద్దతిస్తాం' అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలంతా సిన్హాకే ఓటేస్తారని ఆయన అన్నారు. ఈ సమావేశంలో రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మనీశ్ సిసోడియా, అతిషి, గోపాల్ రారు, రాఘవ చడ్డా, రాకేష్ బిడ్లాన్, దుర్గేష్ పతక్, ఇమ్రాన్ హుసైన్, ఎక్స్ అఫిసియో సభ్యులు పంకజ్ గుప్తా, నరైన్ దాస్ గుప్తాలు పాల్గొన్నారు. ఆప్‌కు 10 మంది రాజ్యసభ సభ్యులున్నారు. కాగా ఎలక్టోరల్ కాలేజీలో ఒక్కొ ఎంపీ ఓటు విలువ 708 కాగా, మొత్తం పది మంది ఎంపీల ఓటు విలువ 7,080గా ఉంది. అలాగే ఆ పార్టీకి పంజాబ్, ఢిల్లీ, గోవా మూడు రాష్ట్రాల్లో156 మంది ఎమ్మెల్యే ఉన్నారు. పంజాబ్‌లో 92 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ ఒక్కొ ఎమ్మెల్యే ఓటు విలువ 116 కాగా, మొత్తం 92 మంది ఎమ్మెల్యేల ఓటు విలువ 10,672గా ఉంది. అలాగే ఢిల్లీలో 62 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఒక్కొ ఎమ్మెల్యే ఓటు విలువ 58 గా ఉంది. మొత్తం 62 మంది ఎమ్మెల్యే ఓటు విలువ 3,596గా ఉంది. గోవాలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండగా, అక్కడ ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 20 కాగా, మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ 40గా ఉంది. మొత్త పది మంది రాజ్యసభ ఎంపిలు, 156 మంది ఎమ్మెల్యే ఓటు విలువ 21,388గా ఉంది.