Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జైళ్లలో మగ్గుతున్న వారిలో 80శాతం మంది రిమాండ్ ఖైదీలే
- చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : హడావిడిగా జరిగే అరెస్టులు, బెయిల్ పొందడం క్లిష్టతరంగా మారడం, అండర్ ట్రయల్స్‌గా జైళ్లలో సుదీర్ఘ కాలం మగ్గిపోవడం ఇవన్నీ చూస్తుంటే మొత్తంగా వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో శనివారం నిర్వహించిన 18వ ఆలిండియా లీగల్ సర్వీసెస్ అథారిటీస్ మీట్లో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా గల 6.10లక్షల మంది ఖైదీల్లో 80శాతం మంది విచారణలో ఉన్న ఖైదీలే ఉండడం విచారకరమైన విషయమన్నారు. వారిని త్వరగా విడుదల చేస్తే చాలదు, ఎలాంటి విచారణ జరగకుండా పెద్ద సంఖ్యలో ఇలా జైళ్లలో మగ్గిపోవడానికి అవకాశమిస్తున్న ఈ వ్యవస్థ తీరును ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. మానవహక్కులపై దాడి గురించి మాట్లాడుతూ, మొత్తంగా ఈ ప్రక్రియే పెద్ద శిక్షగా మారిందని అన్నారు. ''మన క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలో ప్రక్రియ అనేదే శిక్ష. హడావిడిగా, తొందరపాటుతో విచక్షణారహితంగా జరిగే అరెస్టులు నుంచి బెయిల్ పొందడం క్లిష్టంగా మారడం, అండర్‌ట్రయల్స్ సుదీర్ఘంగా జైళ్లలో మగ్గిపోవడం వరకు దారితీసే క్రమంపై అత్యవసరంగా దృష్టి పెట్టాల్సి వుంది.'' అని రమణ పేర్కొన్నారు. క్రిమినల్ జస్టిస్ యంత్రాంగం సామర్ధ్యాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని పిలుపునిచ్చారు. కోర్టుల్లో పెద్ద సంఖ్యలో కేసులు పెండింగ్‌లో వుండడంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలపై ప్రధాన న్యాయమూర్తి ప్రతిస్పందించారు.
న్యాయ వ్యవస్థకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనపై కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టాలని సూచించారు. ''న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న రెండు ప్రధాన సమస్యలు జ్యుడీషియల్ ఖాళీలు, జ్యుడీషియల్ మౌలిక సదుపాయాలు. వీటి గురించి పదేపదే ప్రస్తావిస్తున్నాను. ఖాళీలను భర్తీ చేసే క్రమాన్ని ప్రభుత్వం వేగిరపరచాలని కోరుతున్నాను.. జాతీయ, రాష్ట్ర స్థాయిలో జ్యుడీషియల్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి స్వతంత్ర అధికారులను నియమించాలని ప్రతిపాదించాను. కానీ దురదృష్టవశాత్తూ, అది అమలు కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఇప్పటికైనా పరిశీలిస్తుందని ఆశిస్తున్నాను.'' అని రమణ పేర్కొన్నారు.