Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
టీఎస్ఆర్టీసీలో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్ఎస్)కు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం ఆ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పేరుతో అధికారికంగా సర్క్యులర్ విడుదల చేశారు. 20 ఏండ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులందరూ వీఆర్ఎస్కు అర్హులేనని ప్రకటించారు. జులై 31వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. వీఆర్ఎస్ తీసుకొనే వారికి సంస్థ నిబంధనలు 6(1) ప్రకారం ఏ ప్రయోజనాలైతే వస్తాయో వాటిని మాత్రమే అందచేస్తామని పేర్కొన్నారు. అవికాకుండా అదనపు ప్రయోజనాలుగా... ఎన్నేండ్ల సర్వీస్ మిగిలి ఉన్నా ఐదేండ్ల గరిష్ట సర్వీసును పరిగణనలోకి తీసుకొని ఉద్యోగుల భాగస్వామ్యంతో ఉన్న ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్), ఐదేండ్ల కాలానికి నేషనల్ గ్రాట్యూటీ, పర్యవేక్షణ ప్రయోజనాలు అందిస్తామని తెలిపారు. పలువురు ఉద్యోగులు వేర్వేరు కారణాలతో విధులను సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారనీ, వారి విజ్ఞప్తి మేరకు ఈ ఉత్తర్వులు విడుదల చేస్తున్నట్టు వివరించారు. యూనిట్ ఆఫీసర్ల వద్ద వీఆర్ఎస్ దరఖాస్తులు లభిస్తాయని తెలిపారు. ఏరోజు దరఖాస్తుల్ని ఆరోజే ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. అయితే ఈ ఉత్తర్వులు జారీ చేయడానికంటే ముందే యాజమాన్యం అనధికారికంగా ఉద్యోగుల నుంచి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్ఎస్)కు దరఖాస్తుల్ని స్వీకరించిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఈనెల 15వ తేదీ 'నవతెలంగాణ' కథనంలో పేర్కొన్నది. ఇప్పుడు వాటికి చట్టబద్ధత కల్పిస్తూ, మరికొందరికి అవకాశం కల్పిస్తూ అధికారికంగా ఈ ఉత్తర్వులు జారీ చేశారు.