Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లుల జాబితా విడుదల
- రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఆగస్టు 12 వరకు జరిగే ఈ సమావేశాల్లో దాదాపు 29 బిల్లులను ఆమోదించుకునేందుకు ప్రభుత్వం షెడ్యూల్ చేస్తూ జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు బిల్లుల జాబితాను లోక్సభ సెక్రటేరియట్ బులెటిన్ విడుదల చేసింది. 24 బిల్లులు కొత్తవి కాగా, ఐదు బిల్లులు ఇప్పటికే లోక్సభలో ప్రవేశపెట్టి ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ ఐదు బిల్లుల్లో నాలుగు బిల్లులు స్టాండింగ్ కమిటీకి పంపారు. ఆయా స్టాండింగ్ కమిటీ రిపోర్టులు ఈ సమావేశాల్లో ప్రవేశపెడతారు. ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో 24 బిల్లులను కొత్తగా ప్రవేశపెట్టేందుకు సిద్ధపడుతోంది. ఇందులో పలు కీలక బిల్లులు కూడా ఉభయసభల ముందుకు రానున్నాయి. ఇప్పటికే ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న.. గిరిజనలకు హాని చేసే, అటవీ సంపద దోచిపెట్టేందుకు పచ్చజెండా ఊపే అటవీ సంరక్షణ సవరణ బిల్లు ఈ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నది. ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కరత్, కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్కు, కాంగ్రెస్ నేత కొప్పల రాజు ఎస్టీ కమిషన్కు ఇప్పటికే లేఖలు రాశారు. వందలాది రైతు, వ్యవసాయ కార్మిక, గిరిజన, దళిత, విద్యార్థి, యువజన, కార్మిక సంఘాలతో కూడిన భూమి అధికార్ ఆందోళన్ (బీబీఏ) కూడా ఇప్పటికే తమ అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది.
తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుచేసే బిల్లుతో పాటు కంటోన్మెంట్ బిల్లును పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నది. అంతరాష్ట్ర సహకార సంస్థల సవరణ బిల్లు, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ (దివాలా) చట్ట సవరణ బిల్లును కూడా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఉభయసభల ముందుకు రానుంది. అలాగే జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ (రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటక్షన్) చట్ట సవరణ బిల్లు, గిడ్డంగుల అభివృద్ధి, నియంత్రణ చట్ట సవరణ బిల్లు, కాంపిటీషన్ చట్ట సవరణ బిల్లులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఛత్తీస్గఢ్, తమిళనాడులో ఎస్సీ, ఎస్టీల జాబితాను మార్చేందుకు రాజ్యాంగానికి సవరణ చేయాల్సిన రెండు వేరువేరు బిల్లులు కూడా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్రం తీసుకురానుంది. నేషనల్ డెంటల్ కమిషన్ బిల్లు, ఐఐఎం సవరణ బిల్లు, సెంట్రల్ యూనివర్సిటీ సవరణ బిల్లు, మైన్స్ అండ్ మినరల్స్ బిల్లు, విద్యుత్ సంరక్షణ సవరణ బిల్లు, వ్యక్తుల అక్రమ రవాణా (రక్షణ, సంరక్షణ, పునరావాసం) బిల్లు, ఫ్యామిలీ కోర్ట్సు సవరణ బిల్లు, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పిరిడికల్స్ బిల్లు, నేషనల్ నర్సింగ్ అండ్ మిడ్విఫరీ కమిషన్ బిల్లు, పాత గ్రాంట్ (నియంత్రణ) బిల్లు, కళక్షేత్ర ఫౌండేషన్ బిల్లు ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.
పాత బిల్లులు
వన్యప్రాణుల (రక్షణ) సవరణ బిల్లు, యాంటీ-మారిటైమ్ పైరసీ బిల్లు, తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమం (సవరణ) బిల్లు, జాతీయ డోపింగ్ వ్యతిరేక బిల్లులు ఇప్పటికే లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే వీటిని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి పంపారు. వాటి రిపోర్టులను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఇండియన్ అంటార్కిటిక్ బిల్లు ఇప్పటికే లోక్సభలో ప్రవేశపెట్టబడింది. ఈ ఐదు బిల్లులను కూడా ఆమోదించుకునేందుకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో జాబితా చేశారు.