Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్‌తో చేతులు కలిపారంటూ ఆరోపణ
అహ్మదాబాద్/ న్యూఢిల్లీ : సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌పై కత్తి కట్టిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఆమెపై కుట్ర కేసు బనాయించి శాశ్వతంగా జైలులో ఉంచాలని చూస్తోంది. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ కుట్ర పన్నారని, ఆ కుట్ర అమలుకు సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ సహకరించారని గుజరాత్ పోలీసులు తమ అఫిడవిట్లో పేర్కొన్నారు. తీస్తా, మాజీ ఐపీఎస్ పి.బి.శ్రీకుమార్‌ల బెయిల్ పిటిషన్లను పోలీసులు వ్యతిరేకించారు. గుజరాత్లో మతోన్మాద ఘర్షణల్లో ఉన్నతాధికారులను ఇరికించేందుకు కల్పిత సాక్ష్యాలను సృష్టించడం ద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు భారీ కుట్ర జరిగిందని, అందులో తీస్తా, ఆర్.బి.శ్రీకుమార్, సంజీవ్ భట్‌లకు పాత్ర వుందని పోలీసులు ఆరోపించారు. సంజీవ్భట్తో కలిసి కాంగ్రెస్‌నేత అహ్మద్ పటేల్‌ను ఆయన నివాసంలో సెతల్వాద్ కలుసుకున్నారని, మతోన్మాద ఘర్షణల్లోని బాధితులకు న్యాయం జరగాలనే పేరుతో గుజరాత్ ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేస్తూనే మరోపక్క తనకు రాజ్యసభ సీటు కోసం తీస్తా సెతల్వాద్ ప్రయత్నించారని పోలీసులు పేర్కొన్నారు. ''అప్పటి ముఖ్యమంత్రి ఇతరులను ఇరికించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యం చేసే చర్యలకు పాల్పడేందుకు గాను తీస్తా డబ్బు తీసుకున్నారని ఇద్దరు సాక్షులు చెప్పిన సాక్ష్యాధారాలను పోలీసులు ఆ అఫిడవిట్లో పేర్కొన్నారు. అహ్మద్ పటేల్ నుంచి ఆమెకు రూ.30 లక్షలు అందాయని పోలీసులు చెప్పారు. తీస్తా బెయిల్ పిటిషన్‌పై అదనపు సెషన్స్ జడ్జి డి.డి.థక్కర్ సోమవారం విచారణ జరపనున్నారు. బాధితులకు న్యాయం పేరుతో వసూలు చేసిన నిధుల దుర్వినియోగానికి ఆమె పాల్పడ్డారని పోలీసులు ఆరోపించారు.
చనిపోయినవారినీ వదల్లేదు : కాంగ్రెస్
గుజరాత్ పోలీసుల అఫిడవిట్‌పై కాంగ్రెస్ మండిపడింది. మరణించిన అహ్మద్ పటేల్‌పై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. గుజరాత్ 2002 అల్లర్ల సమయంలో ముఖ్యమంత్రిగా తనపై ఉన్న మారణ హోమానికి సంబంధించిన మరకలను తొలగించుకునేందుకు ప్రధాని మోడీ పకడ్బందీగా అమలు చేస్తున్న వ్యూహంలో భాగమే ఇదంతా అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధాని రాజకీయ ప్రతీకారేచ్ఛ చనిపోయిన వారిని కూడా వదిలిపెట్టడం లేదని తెలిపారు. తమ నేత ఏం చెబితే అది గుజరాత్ పోలీసులు చేస్తున్నారని విమర్శించారు.అంతకుముందు బిజెపి ప్రతినిధి సంబిత్ పాత్రా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ 2002 గుజరాత్ అల్లర్లలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి మోడీని ఇరికించేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుట్ర పన్నారని ఆరోపించారు.