Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంట్లో కేంద్రాన్ని ప్రశ్నిస్తాం
- టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, కె.కేశఖీవరావు
న్యూఢిల్లీ: తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, కె.కేశవరావులు విమర్శించారు. ఆదివారం నాడిక్కడ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి నామా నాగేశ్వరరావు, కె.కేశవరావులు హాజరయ్యారు. అనంతరం కె.కేశవరావు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ పట్ల కేంద్రం చిన్న చూపు చూపిస్తున్నదనీ, పార్లమెంట్లో కేంద్రాన్ని ప్రశ్నిస్తామని అన్నారు. అఖిలపక్ష భేటీ తంతుగా మారిందని, ప్రతిపక్షం కొంచెం మాట్లాడితే అధికార పక్షం సహించలేక పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంబంధిత అంశాలపై చర్చ చేపట్టాలని అఖిల పక్షంలో చెప్పామని అన్నారు. సమాఖ్య వాదమంటూ కేంద్రీకరణ చేస్తున్నారని విమర్శించారు. ధర్నాలు చేయొద్దని ఆదేశాలు ఇచ్చినా తాము చేస్తామని పేర్కొన్నారు. అన్ పార్లమెంటరీ పదాలుగా కొన్నింటిని తొలగించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. కులాల వారీగా జన గణన చేపట్టాలని కోరామన్నారు. దేశాన్ని నార్త్ ఇండియానే పాలిస్తోందని విమర్శించారు. విభజన హామీలు అమలు చేయటం లేదని అన్నారు. తాము ప్రతిపక్షాలతో ఉన్నామని, కాంగ్రెస్తో స్నేహం లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతుపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామనీ, బీజేపీని వ్యతిరేకిస్తున్నామంటే కాంగ్రెస్తో ఉన్నట్టు కాదని అన్నారు.
అటవీ సంరక్షణ బిల్లును వ్యతిరేకిస్తాం: నామా నాగేశ్వరరావు
పార్లమెంట్లో అటవీ సంరక్షణ బిల్లును వ్యతిరేకిస్తామని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఆదివాసీలకు నష్టం చేసే, పొట్ట కొట్టే ఈ బిల్లును తాము అంగీకరించబోమని అన్నారు. అగ్నిపథ్ పథకంపై పార్లమెంట్లో లెవనెత్తుతామనీ, గవర్నర్ జోక్యంపై పార్లమెంట్లో చర్చ జరగాలని అన్నారు. అవసరమైన బొగ్గు ఉన్నప్పుడు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గును ఉపయోగించాలన్న అంశాన్ని లేవనెత్తుతామని అన్నారు. ధాన్యం కొనుగోలుపై కూడా కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పారు. ఎఫ్ఆర్బీఎం పరిధిలో రాష్ట్రం ఉన్నప్పటికీ, ఆర్ధిక ఇబ్బందులకు గురిచేసే యోచనలో కేంద్రం ఉందని విమర్శించారు. రూ.3.65 లక్షల కోట్లు రాష్ట్రం నుంచి తీసుకున్న నిధులు కంటే, తక్కువ నిధులు రాష్ట్రానికి ఇచ్చిందని ఆరోపించారు. ప్రజా సమస్యలు, దేశ సమస్యలపై చర్చల తరువాతే బిల్లుల ఆమోదానికి ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు.