Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎఐఆర్‌టీడబ్ల్యూఎఫ్ ని బలోపేతం చేయండి
- ప్రభుత్వ దాడులను తిప్పికొట్టండి
- ఎఐఆర్‌టీడబ్ల్యూఎఫ్ మహాసభలో సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోడీ సర్కార్ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరు విస్తృత ఐక్యత నిర్మించాలని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ పిలుపు ఇచ్చారు. హర్యానాలోని హిస్సార్‌లో గత రెండు రోజులుగా జరుగుతున్న ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎఐఆర్‌టీడబ్ల్యూఎఫ్) 11వ జాతీయ మహాసభల్లో ఆదివారం ఆ సంఘం ప్రధాన కార్యదర్శి కె.కె.దివాకరన్ నివేదికను సమర్పించారు. ఈ నివేదికపై చర్చ కొనసాగుతుంది. ఈ సందర్భంగా తపన్ సేన్ మాట్లాడుతూ రవాణ రంగ పరిశ్రమలపైనా, కార్మిక వర్గంపైనా, మొత్తం ప్రజలపైనా ప్రభుత్వం ఏ విధంగా దాడులను తీవ్రతరం చేస్తుందో వివరించారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు, మోటర్ వెహికల్ చట్ట సవరణ, కార్మిక చట్టాల స్థానంలో కార్మిక కోడ్లు వంటి ప్రభుత్వ దాడులను ఉదహరించారు. ఎఐఆర్‌టీడబ్ల్యూఎఫ్ ని బలోపేతం చేయడానికి, రవాణ రంగ పరిశ్రమ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు విస్తృత ఐక్యతను నిర్మించడానికి ఇది సరైన సమయమని అన్నారు. రవాణ రంగం ఆర్థిక వ్యవస్థకు జీవనాధారమనీ, అందులో రోడ్డు రవాణ కార్మిక ఫెడరేషన్ కీలక పాత్ర పోషించాలని సూచించారు. రాష్ట్ర రవాణ సంస్థలు లాభ, నష్టాల స్కేల్‌పై కొలవబడవని ఆయన అన్నారు. హాస్యాస్పదంగా ఇది మనదేశంలో జరుగుతోందని విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి వైఖరిని ప్రభుత్వాలు ప్రదర్శించడం లేదని పేర్కొన్నారు. దేశంలోని ప్రభుత్వాలు రాష్ట్ర రవాణ సంస్థల పాత్రను భారీగా తగ్గించాయనీ, ఈ రంగంలోకి ప్రయివేట్ ఆపరేటర్ల వచ్చారని తెలిపారు. ప్రయివేట్ రవాణా రంగం రోజురోజుకు విస్తరిస్తోందని,ప్రయివేట్ రవాణా కార్మికులను సంఘటితం చేయడానికి ఎఐఆర్‌టీడబ్ల్యూఎఫ్ దృష్టి పెట్టాలని సూచించారు.
కార్పోరేట్లకు సేవ చేయాలనే నినాదంతో కార్మికవర్గం, ప్రజల మధ్య విభజన తీసుకురావడానికి మతపరమైన, విభజన రాజకీయాలు ఆడుతున్నారని ఆయన హెచ్చరించారు. కార్మిక వర్గం దీనిని గుర్తించి, ఇలాంటి రాజకీయాలను ఓడించేందుకు సిద్ధం కావాలని పిలుపు ఇచ్చారు. కోట్లాది అసంఘటిత రోడ్డు రవాణా కార్మికుల కోసం ''సామాజిక భద్రతా చట్టం'' అమలు చేయాల్సిన అవసరంపై తీర్మానాన్ని ఎఐఆర్‌టీడబ్ల్యూఎఫ్ జాతీయ కార్యదర్శి టికె.రాజన్ ప్రవేశపెట్టారు. ఆ సంఘం వర్కింగ్ కమిటీ సభ్యుడు ముస్తాద్ అహ్మద్ ఖాన్ బలపరిచారు. ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.