Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు బాలికల యూనిఫామ్ విప్పించిన ఉపాధ్యాయులు
- ఇతర విద్యార్థులతో ధరింపజేసి ఫోటో దిగిన వైనం
లక్నో : బీజేపీ పాలిత యూపీలో.. విద్యా బుద్ధులు నేర్పే ఒక పాఠశాలలో.. దళితుల పట్ల వివక్ష ఏ విధంగా ఉన్నదో తెలియజేసే ఘటన ఇది. అక్కా చెల్లెళ్లు అయిన ఇద్దరు దళిత బాలికల యూనిఫామ్‌ను ఇద్దరు టీచర్లు బలవంతంగా విప్పించారు. అనంతరం 'ఫోటోసెషన్' కోసం ఆ ఇద్దరి యూనిఫామ్‌ను ఇతర విద్యార్థులకు ధరింపజేశారు. అప్పటి వరకూ ఆ ఇద్దరు బాలికలు అర్ధనగంగానే ఉండిపోయారు. హాపూర్‌లోని దహిర్పూర్లో గల ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకున్న ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై ఆ చిన్నారుల తల్లిదండ్రులు కాపూర్పూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక్కడి పాఠశాలలో దళిత విద్యార్థుల పైన తరచూ వివక్ష కొనసాగుతున్నదని అందులో పేర్కొన్నారు. సునీత, బంధన అనే ఇద్దరు టీచర్లు.. తమ పిల్లల వద్దని చెప్పినప్పటికీ బలవంతంగా వారి చేత యూనిఫామ్ విప్పించారని బాధిత విద్యార్థినుల తండ్రి గౌతమ్ ఆరోపించారు. ఈ క్రమంలో తమ పిల్లలను కొట్టారన్నారు. ఈ ఘటన గురించి ఇంట్లో ఎవరికీ చెప్పకూడదని సదరు టీచర్లు తమ ఇద్దరు చిన్నారులను బెదిరించారన్నారు. దీనిపై స్కూల్ ప్రిన్సిపాల్ తమ తప్పును కప్పిపుచ్చుకొనే యత్నం చేశారని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్నదని బేసిక్ శిక్షా అధికారి (బీఎస్ఏ)త అర్చన గుప్తా తెలిపారు. దురదృష్టవశాత్తు ఇది ఒక్క ఘటనే కాదనీ, ఇలాంటి ఘటనలు గతంలోనూ అనేకం జరిగాయని మానవ హక్కుల కార్యకర్త అనిరుద్ శర్మ అన్నారు. నిందితులైన ఇద్దరు ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.