Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని గైర్హాజర్ పై ప్రతిపక్షాల నిలదీత
- శ్రీలంక సంక్షోభంపై 19న అఖిలపక్ష భేటీ
- ప్రజా సమస్యలపై చర్చించాలి: వి.శివదాసన్, సీపీఐ(ఎం)
- నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అధికార, ప్రతిపక్షాలు తమ ఎజెండాలతో సిద్ధం అయ్యారు. ప్రజా సమస్యలు, దేశం ఎదుర్కొంటున్న సవాళ్లుపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షాలు కాచుకుని ఉన్నాయి. బిల్లులు ఆమోదించుకునేం దుకు ప్రభుత్వం యోచిస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గైర్హాజరయ్యారు. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ప్రధాని మోడీ సమావేశానికి హాజరుకాకపోవడం అన్‌పార్లమెంటరీ కాదా? అని ప్రశ్నించాయి. ఆదివారం పార్లమెంట్ ఎనెక్స్ బిల్డింగ్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. 45 పార్టీలను ఆహ్వానిస్తే, 36 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. అఖిలపక్ష సమావేశంలో అటవీ హక్కుల చట్టం-2006ను నిర్వీర్యం చేసే అంశాన్ని ఎన్డీఏ పక్షాలతో సహా అన్ని ప్రతి పక్షాలు లేవనెత్తాయి. అలాగే అగ్నిపథ్, ధరలు పెరుగుదలతో సహా అనేక ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు లేవనెత్తాయి. తాము అన్ని అంశాలు చర్చించేందుకు సిద్ధంగానే ఉన్నామని కేంద్రం పేర్కొంది. అధికార సమచారం హిందీలోనే ఉండటం పట్ల ఎండీఎంకే నేత వైగో అభ్యతరం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు పియూశ్ గోయల్, అర్జున రామ్ మేఘ్వాల్, వి.మురళీధరన్ (బీజేపీ), కేంద్ర మంత్రి పసుపతి కుమార్ పరాస్ (ఎల్జేఎస్పీ), కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ (అప్నాదళ్), రాందాస్ అథ్వాలే (ఆర్పీఐ), తంబిదొరై (అన్నాడీఎంకే), ప్రతిపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, జైరాం రమేష్ (కాంగ్రెస్), టిఆర్ బాలు, తిరుచ్చి శివ (డీఎంకే), శరద్ పవర్, సుప్రియా సులే (ఎన్సీపీ), సుదీప్ బందోపాధ్యాయ (టీఎంసీ), పిఆర్ నటరాజన్, శివదాసన్ (సీపీఐ(ఎం), విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి (వైసీపీ), గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్ (టీడీపీ), కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు (టీఆర్ఎస్), పినాకి మిశ్రా (బీజేడీ), సంజరు రౌత్, వినాయక్ భౌరావ్ రౌత్ (శివసేన), బినరు విశ్వం (సీపీఐ), ఏడి సింగ్ (ఆర్జేడీ), రాంగోపాల్ యాదవ్ (ఎస్పీ), సంజరు సింగ్ (ఆప్), జయంత్ చౌదరి (ఆర్ఎల్డీ), వైకో (ఎండీఎంకే), ఎన్‌కె ప్రేమ్‌చంద్రన్ (ఆర్ఎస్పీ), తిరుమవలవన్ (వీసీకే), హర్సిమ్రత్ కౌర్ (ఎస్ఏడీ), మహ్మద్ బషీర్ (ఐయుఎంఎల్) తదితరులు పాల్గొన్నారు.
అన్ని అంశాలు చర్చించేందుకు సిద్ధం: ప్రహ్లాద్ జోషి
ప్రహ్లాద్ జోషి మీడియాతో మాట్లాడుతూ సమావేశానికి హాజరైన అన్ని పార్టీల నాయుకులు తమ అభిప్రాయాలు తెలిపారని, సూచనలు ఇచ్చారని పేర్కొన్నారు. కొన్ని అంశాలను చర్చించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారన్నారు. పార్లమెంట్లో ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అలాగే శ్రీలంక సంక్షోభంపై చర్చించేందుకు తాము జులై 19 (మంగళవారం) మరోసారి అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేస్తున్నామనీ, ఇందులో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొంటారని తెలిపారు.
13 ప్రజా, జాతి ప్రయోజన అంశాలు లేవనెత్తాం: మల్లికార్జున ఖర్గే
కాంగ్రెస్ నేత మల్లికార్జన ఖర్గే మీడియాతో మాట్లాడుతూ అఖిలపక్ష సమావేశంలో 13 ప్రజా, జాతి ప్రయోజన అంశాలను ప్రస్తావించామని అన్నారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం 32 బిల్లులను ప్రవేశపెట్టాలని నిర్ణయించిందనీ, అయితే అందులో 14 మాత్రమే సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఆ 14 బిల్లులు గురించి తమకు చెప్పలేదని అన్నారు. ఈ సమావేశాల్లో కేవలం 14 రోజులు మాత్రమే కార్యకలాపాలు జరుగుతాయని తెలిపారు. సమాఖ్య విధానంపై దాడి, అగ్నిపథ్ పథకం, డిహెచ్ఎఫ్ఎల్ బ్యాంక్ మోసం, నియంత్రణ లేని ధరలు పెరుగుదల, పెరిగిన నిరుద్యోగం, రూపాయి పతనం, విద్వేష ప్రసంగాలు, జమ్మూకాశ్మీర్‌లో క్రైం పెరుగుదల, కాశ్మీర్ పండిట్లపై దాడి, స్వతంత్ర సంస్థలు, రాజ్యాంగ సంస్థల ధ్వంసం, జాతీయ భద్రతకు సంబంధించి ఇండియా-చైనా వివాదం, విదేశాంగ విధానం వైఫల్యం, మైనార్టీల ఇండ్ల కూల్చివేత, కాంగ్రెస్ నేతలపై అప్రజాస్వామ్య దాడి, అటవీ సంరక్షణ రూల్స్ సవరణ వంటి అంశాలపై చర్చ జరగాలని కోరినట్టు చెప్పారు. సభ సజావుగా జరిగేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ప్రజల ప్రయోజనాల దృష్య ముఖ్యమైన అంశాలను లేవనెత్తుతామని తెలిపారు. ఆప్ ఎంపీ సంజరు సింగ్ మాట్లాడుతూ పార్లమెంట్లో చర్చకు తాను మూడు అంశాలు ప్రస్తావించానని అన్నారు.
ప్రజా సమస్యలపై చర్చించాలి: వి.శివదాసన్, సీపీఐ(ఎం)
దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేసినట్లు సీపీఐ(ఎం) ఎంపీ వి.శివదాసన్ తెలిపారు. ప్రభుత్వం బిల్లులు ఆమోదించుకునేందుకు ప్రతిపాదించిందని, అయితే తాము ప్రజా సమస్యలను లేవనెత్తామని అన్నారు. అగ్నిపథ్, ధరలు పెరుగుదల, నిరుద్యోగం, బఫర్ జోన్, శ్రీలంక సమస్య వంటి అంశాలను లేవనెత్తామని అన్నారు. ప్రతిపక్షం లేవనెత్తిన అంశాలపై చర్చకు ప్రభుత్వం అనుమతించాలని కోరామన్నారు. సభ సజావుగా జరిగేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని సూచించారు. అన్ పార్లమెంటరీ పదాలుగా కొన్నింటిని ప్రకటించడంపైన, అలాగే ధర్నాలు, ఆందోళనలు, దీక్షలు చేయొద్దని ఆదేశాలు జారీ చేయడం వంటి అప్రజాస్వామ్య చర్యలను ఆపాలని సూచించినట్లు తెలిపారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ విభజన చట్టంలోని అన్ని అంశాలను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్టు తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని టీడీపీ ఎంపి కనకమేడల రవీంద్ర కుమార్ కోరారు.