Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపక్షాల సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం
- మంగళవారం నామినేషన్ దాఖలు : శరద్ పవార్
న్యూఢిల్లీ : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ గవర్నర్ మార్గరెట్ అల్వా పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆదివారం ఎన్సీపీ అధినేత శరద్ పవర్ నివాసంలో ప్రతిపక్షాల సమావేశం జరిగింది. రెండు గంటల పాటు సుదీర్ఘ సమావేశం అనంతరం శరద్ పవార్ ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్ అల్వా పేరును ప్రకటించారు. ఆమె అభ్యర్థిత్వాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయని తెలిపారు. ఆమె మంగళవారం నామినేషన్ దాఖలు చేస్తారని వెల్లడించారు. 17 పార్టీలు ఏకగ్రీవంగా ఆమెను బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నాయనీ, టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీల మద్దతుతో ఆమె ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగుతారని చెప్పారు. దీంతో ఆమెకు మొత్తం 19 పార్టీల మద్దతు ఉందని అన్నారు. జేఎంఎం కూడా ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఉంటుందని తెలిపారు. ఈ ఎన్నికల్లో తామంతా కలిసి కట్టుగా ఉన్నామని శివసేన ఎంపీ సంజరు రౌత్ అన్నారు. ఈ సమావేశంలో సుప్రియా సూలే (ఎన్సీపీ), సీతారాం ఏచూరి (సీపీఐ(ఎం), డి.రాజా, బినరు విశ్వం (సీపీఐ), మల్లికార్జున ఖర్గే, జైరాం రమేష్ (కాంగ్రెస్), రాంగోపాల్ యాదవ్ (ఎస్పీ), టిఆర్ బాలు, తిరుచ్చి శివ (డీఎంకే), సంజరు రౌత్ (శివసేన), కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు (టీఆర్ఎస్), ఎడి సింగ్ (ఆర్జేడీ) వైగో (ఎండీఎంకే), ఎన్‌కె ప్రేమ్ చంద్రన్ (ఆర్ఎస్పీ), తిరుమవలవన్ (వీసీకే), ఈటి మహ్మద్ బహీర్ (ఐయుఎంఎల్), జోషి కె. మణి (కేరళ కాంగ్రెస్) పాల్గొన్నారు.
మార్గరెట్ అల్వా నేపథ్యం
మార్గరెట్ అల్వా 1942 ఏప్రిల్ 14న కర్నా టకలోని మంగళూర్లో రోమన్ క్యాథలిక్ కుటుంబంలో జన్మించారు. ఆమె నాలుగు సార్లు రాజ్యసభకు, ఒక సారి లోక్‌సభకు ఎన్నిక అయ్యారు. రాజీవ్ గాంధీ, పివి నరసింహరావు ప్రభుత్వాల్లో కేంద్రమంత్రిగా పని చేశారు. ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, గోవా గవర్నర్‌గా కూడా పని చేశారు. అల్వా బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కళాశాల నుంచి బీఏ పట్టా పొందారు. అదే నగరంలో ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అల్వా మహిళలు, చిన్నారులకు సంబంధించిన సమస్యలపై దృష్టి పెట్టేందుకు కరుణ అనే సంస్థను ప్రారంభించారు. యంగ్ ఉమెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా కూడా పని చేశారు. 1964 మే 24న ఆమె నిరంజన్ థామస్ అల్వాను వివాహం చేసుకున్నారు. 1969లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పటికే ఆమె అత్త కాంగ్రెస్ తరఫున ఎంపీగా ఉన్నారు. 1975 నుంచి 1977 ఏఐసీసీ సంయుక్త కార్యదర్శిగా, 1978 నుంచి 1980 వరకు కర్నా టక పీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 1974లో అల్వా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1980,1986,1992లో తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1983-85 మధ్య ఆమె రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. 1984-85 మధ్య పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా, 1985-89 మధ్య యువజన, క్రీడలు శాఖ సహాయ మంత్రిగా, మహిళ, శిశు సంక్షేమ, మానవ వనరుల అభివృద్ధి శాఖల సహాయ మంత్రిగా కూడా పని చేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా కూడా పని చేశారు. ఆమె 1991-96 మధ్య సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు శాఖ సహాయ మంత్రిగా, 1993-96 మధ్య పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా పని చేశారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో మహిళలు, చిన్నారుల హక్కులు మెరుగుపరచడానికి ఉద్దేశించిన 28 పాయింట్ల ప్రణాళికను ఆల్వా పర్యవేక్షించారు. మహిళ అభివృద్ధి కోసం వివిధ కార్పొరేషన్లను ఆమె ప్రతిపాదించారు. ప్రస్తుత ఉన్న వాటిలో చాలా వరకు ఆమె ప్రతిపాదించినవే. స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాలనే ఆమె 1989లో ప్రతిపాదన చేసింది. 1993లో అది చట్టంగా మారింది. అలాగే ఆమె మంత్రిగా ఉన్నప్పుడు వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాల్లో, యూపీఎస్సీ, న్యాయ వ్యవస్థ వంటి సంస్థల్లో మహిళ సంఖ్యను పెంచడానికి తీవ్రంగా ప్రయత్నించారు. 1999లో ఆమె ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నిక అయ్యారు. 2004లో ఆమె ఓటమి చెందారు. 2004-09 మధ్య ఆమె ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2009 ఆగస్టు 6న అల్వా ఉత్తరాఖండ్ మొదటి మహిళా గవర్నర్‌గా నియమితులయ్యారు. 2012 మే 14 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ తరువాత ఆమె రాజస్థాన్ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2014 ఆగస్టు 5 వరకు ఆమె ఆ బాధ్యతల్లో ఉంది. ఆ తరువాత ఆమె గుజరాత్ గవర్నర్‌గా 2014 జులై 15 వరకు, గోవా గవర్నర్‌గా 2014 ఆగస్టు 7 వరకు కొనసాగారు.