Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ ఏడాది గణనీయంగా పడిపోయిన గోధుమ సేకరణ, నిల్వలు
- గత ఏడాది జూన్‌నాటికి 433 లక్షల టన్నులు సేకరణ
- 2022లో 188లక్షల టన్నులకు పరిమితం
- 14ఏండ్ల కనిష్టానికి..ప్రభుత్వ గోడౌన్లలో గోధుమ నిల్వలు
- ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో గోధుమల స్థానంలో బియ్యం పంపిణీ
- ఇలాగైతే కోట్లాదిమంది ఆహార భద్రత గల్లంతు : రాజకీయ విశ్లేషకులు
న్యూఢిల్లీ : కరోనా సంక్షోభం, బొగ్గు కొరత సమయంలో మోడీ సర్కార్ ముందు చూపు, సన్నద్ధత లేకపోవటం దేశ ప్రజల్ని ఎన్నో కష్టనష్టాలకు గురిచేసింది. దాదాపు 140కోట్ల జనాభా కలిగిన మనదేశానికి ఆహార భద్రత అత్యంత కీలకమైన అంశం. అయితే నేడు దేశంలో గోధుమ సేకరణ మునుపెన్నడూ లేనంతగా పడిపోయిందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభుత్వ గోడౌన్లలో ఉన్న గోధుమ నిల్వలు 14 ఏండ్ల కనిష్టానికి, ఈ ఏడాది (జూన్ నాటికి) గోధుమ కొనుగోళ్లు 20ఏండ్ల కనిష్టానికి పడిపోయాయి. పీడీఎస్ కింద ఆయా రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్న గోధుమలపై కేంద్రం పెద్దమొత్తంలో కోతలు విధిస్తోంది. గత ఏడాదితో పోల్చితే కేరళ, తమిళనాడు, ఉత్తరాఖండ్‌కు గోధుమ కేటాయింపులు సగటున 1.13లక్షల టన్నుల మేరకు తగ్గింది. ఆయా రాష్ట్రాల్లో పేద కుటుంబాల ఆహార భద్రత ప్రమాదంలో పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆహార పంటల్లో అత్యంత ముఖ్యమైంది, ఉత్తరాదిన కోట్లాది మంది ప్రధాన ఆహారం గోధుమలు. సాగు సమయంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉంటేనే పంట దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఈఏడాది మార్చి-ఏప్రిల్‌లో అధిక ఉష్ణోగ్రతలు గోధుమ దిగుబడిని గణనీయంగా దెబ్బతీశయి. దాంతో ప్రభుత్వ కొనుగోళ్లు కేవలం 188 లక్షల టన్నుల వద్దే ఆగిపోవటం..ప్రమాద ఘంటికలుగా భావించాలి. ప్రధాని మోడీకి సైతం ఈ సమాచారం వెళ్లిందని, అందువల్లే మే నెలలో హఠాత్తుగా ఎగుమతులపై నిషేధం విధించారని సమాచారం. ఆహార నిల్వలకు సంబంధించి కీలక సమాచారాన్ని కేంద్రం దాచిపెట్టడానికి ప్రయత్నించింది. పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద పంపిణీ చేస్తున్న గోధుమల్లో 55 లక్షల టన్నులు కోత విధించింది. రేషన్ లబ్దిదారులకు గోధుమలకు బదులు బియ్యం పంపిణీ చేసింది.
కొనుగోళ్లు 57శాతం తగ్గాయి..
ఈ ఏడాది జూన్ నాటికి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం జరిపిన గోధుమ కొనుగోళ్లు 188 లక్షల టన్నులు. గత ఏడాది 433 లక్షల టన్నుల సేకరణతో పోల్చితే, ఈ ఏడాది సేకరణ 57శాతం తగ్గింది. గత 20ఏండ్లలో ఎన్నడూ ప్రభుత్వ కొనుగోళ్లు ఈస్థాయిలో పడిపోలేదు. 2002లో గోధుమ కొనుగోళ్లు 164 లక్షల టన్నులు కాగా, అటు తర్వాత వరుసగా ప్రతిఏటా కొనుగోళ్లు పెరిగాయే తప్ప, పడిపోలేదు. ప్రజల ఆహార భద్రతకు సంబంధించి గోధుమ నిల్వలు అత్యంత కీలకమైన అంశం. 2008లో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంట దిగుబడి, కొనుగోళ్లు గణనీయంగా పడిపోయాయి. ఆ ఏడాది ప్రభుత్వ గోడౌన్ల వద్ద గోధుమ నిల్వలు (242 లక్షల టన్నులు) అత్యంత కనిష్టస్థాయికి చేరుకున్నాయి. అటు తర్వాత మళ్లీ 14 ఏండ్లకు గోధుమ నిల్వలు కనిష్టస్థాయికి చేరుకోవటం (2022లో 311 లక్షల టన్నులు) ప్రమాద హెచ్చరికగా భావించాలని నిపుణులు చెబుతున్నారు.
అడుగంటుతున్న నిల్వలు
జులై 1, 2022 నాటికి దేశంలో గోధుమ నిల్వలు 275 లక్షల టన్నులకు పడిపోయింది. పలు రాష్ట్రాల్లో రేషన్ పంపిణీకి ఈ నిల్వలు సరిపోవు. ప్రకృతి విపత్తులు సంభవిస్తే, ఇతర కారణాలు పరిగణలోకి తీసుకుంటే గోధుమలకు డిమాండ్ మరింత పెరుగుతుందేగానీ, తగ్గదు. అలాంటప్పుడు కోట్లాది పేద కుటుంబాల ఆహార భద్రత సంగతేంటన్న ప్రశ్నకు సమాధానం దొరకటం లేదు. ముందస్తు ప్రణాళిక, వ్యూహంతో ఆహార నిల్వలు తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే. వాస్తవానికి ఉత్తరాదిన అనేక రాష్ట్రాల్లో రేషన్ పంపిణీలో గోధుమలు కాకుండా బియ్యం పంపిణీ చేస్తున్నారని, గోధుమల సంక్షోభాన్ని కేంద్రం దాచిపెడుతోందని విమర్శలున్నాయి.
81కోట్ల మందిపై ప్రభావం
ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సరఫరా అవుతున్న ఆహార ధాన్యాలకు సంబంధించి ఈ ఏడాది మే నెలలో కేంద్రం కీలక మార్పు చేసింది. ఆయా రాష్ట్రాలకు గోధుమ, బియ్యం పంపిణీ 60:40 నిష్పత్తిలో ఉండగా, దానిని 40:60 నిష్పత్తికి మార్చింది. తద్వారా 61లక్షల టన్నుల గోధుమల్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పక్కకు పెట్టింది. ఈ నిర్ణయం వల్ల బీహార్, జార్ఖాండ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు పీడీఎస్ కింద గోధుమ పంపిణీ తగ్గింది. సుమారుగా 81కోట్ల మంది లబ్దిదారులకు అందాల్సిన ఆహార పదార్థాలు అందలేదు. ఈ రాష్ట్రాలకు అంతక్రితం 15.36లక్షల టన్నుల గోధుమ సరఫరా కాగా, అది 9.39 లక్షల టన్నులకు పడిపోయింది.