Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆహారోత్పత్తులపై ట్యాక్స్ అనైతికం
- జీఎస్టీపై ఢిల్లీ వ్యాపారస్తుల ఆందోళనలు
న్యూఢిల్లీ: ప్యాకింగ్ ఆహారో త్పత్తులపై కొత్తగా పన్నులు వేయడాన్ని ఢిల్లీ వ్యాపారస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత నెలలో చంఢగీడ్‌లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాలు, పాలు ఆధారిత ఉత్పత్తులు సహా ప్యాకింగ్ అహారోత్పత్తులపై జీఎస్టీ విధించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన నిర్ణయం తీసుకున్నారు. ఈ పన్నుల పెంపు ప్రజా వ్యతిరేక చర్య అని చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండిస్టీస్ (సీటీఐ) చైర్మెన్ బ్రిజేష్ గోయల్ ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర భారత దేశంలో తొలిసారి పప్పు, బియ్యం, తృణ ధాన్యాలు, మొక్కజొన్న, బెల్లం, తేనే, పెరుగు, లస్సీలపై పన్నులు వేస్తున్నారన్నారు. ఈ పన్నులను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇకపై ప్యాక్ చేసిన పెరుగు, మజ్జిగ, పన్నీరు, లస్సీ, గోదుమలు, మొక్కజొన్న తదితర వాటిపై సోమవారం నుంచి 5 శాతం పన్ను రేటు అమల్లోకి వచ్చింది. గోధుమ పిండి, అప్పడాలు, చేపలు, తేనే, ఎండు చిక్కుళ్లు పైనా పన్నులను ప్రారంభించారు.
''పన్నుల పెంపు నిర్ణయాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. దీన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ పన్ను విధానాలు సామాన్యులను, వ్యాపారాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇది ప్రజా వ్యతిరేక చర్య.'' అని ఢిల్లీ గ్రెయిన్ మర్చంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న ఈ పన్నులకు వ్యతిరేకంగా శనివారం వ్యాపారులు తమ షాప్‌లను మూసివేసి బంద్‌ను చేపట్టారు. బుధవారం కూడా చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండిస్టీస్ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే అధిక ధరలతో బెంబేలెత్తుతున్న ప్రజలు కొత్త పన్నులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజధానిలో వ్యాపారస్తులు చేస్తున్న ఆందోళనకు మద్దతును ఇస్తున్నారు.