Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైర్మెన్‌గా మాజీ వ్యవసాయ కార్యదర్శి సంజరు అగర్వాల్
- కమిటీలో ముగ్గురు ఎస్కేఎం సభ్యులు
- రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల్లో ఏపీ అడిషనల్ చీఫ్ సెక్రెటరీ
- గెజిట్ విడుదల
న్యూఢిల్లీ : కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై కేంద్ర ప్రభుత్వం 29 మందితో కమిటీ వేసింది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కమిటీ ఏర్పాటుచేశారు. ఎంఎస్పీతో పాటు జీరో బడ్జెట్ వ్యవసాయం, వ్యవసాయ మార్పిడి వంటి అంశాలపై ఈ కమిటీ పని చేస్తుందని గెజిట్‌లో పేర్కొన్నారు. ఈ కమిటీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతు సంఘాల నేతలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ ఆర్థిక వేత్తలు ఉన్నట్టు గెజిట్ తెలిపింది. కమిటీ చైర్మన్‌గా మాజీ వ్యవసాయ కార్యదర్శి సంజరు అగర్వాల్ వ్యవహరిస్తారనీ, సభ్యులుగా నిటి ఆయోగ్ (వ్యవసాయం) సభ్యుడు రమేష్, వ్యవసాయ ఆర్థిక వేత్తలు సిఎస్సి శేఖర్ (ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఎకానమిక్స్ డవలప్మెంట్), కుఖ్పల్ సింగ్ (ఐఐఎం, అహ్మదాబాద్), జాతీయ అవార్డు గ్రహిత రైతు భరత్ భుషన్ త్యాగి, ఎస్‌కేఎంకు చెందిన ముగ్గురు సభ్యులు (ఎస్కేఎం ఇచ్చిన పేర్లు), ఇతర రైతు సంఘాల సభ్యులు గున్వాంత్ పటేల్, క్రిశ్వనీర్ చౌదరి, ప్రమోద్ కుమార్ చౌదరి, గుని ప్రకాశ్, సైద్ పాషా పటేల్, ఫిక్కి చైర్మన్ దిలిప్ సంఘని, సీఎన్ఆర్ఐ జనరల్ సెక్రటరీ బినోద్ ఆనంద్, సీఏసీపీ సభ్యుడు నవీన్ పి. సింగ్, వ్యవసాయ యూనివర్శిటీల సభ్యులు పి. చంద్రశేఖర్ డైరెక్టర్ జనరల్ ఎంఏఎన్ఏజీఈ, జెపి శర్మ కాశ్మీర్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్, ప్రదీప్ కుమార్ బిసేన్ జేఎన్ఏయూ వైస్ చాన్సలర్, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి, ఐసీఏఆర్ కార్యదర్శి, కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి, సహకార శాఖ కార్యదర్శి, జౌళి శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా ఆంధ్రప్రదేశ్, కర్నాటక, సిక్కిం, ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వాల అడిషనల్ చీఫ్ సెక్రటీరలు సభ్యులుగా ఉన్నారు. మెంబర్ సెక్రటరీగా కేంద్ర వ్యవసాయ శాఖ (క్రాప్స్) సంయుక్త కార్యదర్శి ఉంటారని తెలిపింది.
కమిటీ విధి విధానాలు: ఎంఎస్పీకి మూడు విధి విధానాలు పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. వ్యవస్థను మరింత ప్రభావవంతంగా, పారదర్శకం గా చేయడం ద్వారా దేశంలోని రైతులకు ఎంఎస్పీని అందు బాటులో ఉంచడానికి సూచనలు చేయాలని తెలిపింది. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ (సీఏసీపీ)కి మరింత స్వయంప్రతిపత్తి కల్పించేందుకు ఆచరణాత్మకతపై సూచనలు. దానిని మరింత శాస్త్రీయంగా మార్చేందుకు చర్యలకు సూచించాలని తెలిపింది. దేశీయ ఎగుమతి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా రైతులకు వారి ఉత్పత్తులకు లాభసాటి ధరలు, అధిక విలువను నిర్ధారించడానికి దేశంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై సూచనలు ఇవ్వాలని కోరింది. అలాగే ప్రకృతి వ్యవసాయం, పంట మార్పిడికి కూడా సలహాలు, సూచనలు చేయాలని తెలిపింది.