Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పది రాష్ట్రాల్లో, పుదుచ్చేరిలో వంద శాతం
- 4,754 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల ఓటు
- ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ
న్యూఢిల్లీ : 16వ రాష్ట్రపతి ఎన్నికకు జరిగే పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్, కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరి, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో మొత్తం 31 ప్రాంతాల్లో పోలింగ్ జరిగింది. మొత్తం 4,796 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 99శాతం పోలింగ్ జరిగింది. 11 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో వందశాతం పోలింగ్ జరిగింది. రాజ్యసభలో ఐదు, రాష్ట్ర అసెంబ్లీల్లో ఆరు ఖాళీలున్నాయి. దీంతో ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 4,796 మంది ఓటర్లను జాబితా చేసినట్టు ఈసీ తెలిపింది. అందులో 771 మంది ఎంపీలు, 4,025 మంది ఎమ్మెల్యేల్లో 99శాతం మంది ఓట్లు వేశారు.
ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, కేరళ, కర్నాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, మిజోరం, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరిలో వంద శాతం పోలింగ్ జరిగింది. తమిళనాడులో ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా సోకడంతో పీపీఈ కిట్లు ధరించి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనర్హత వేటు కారణంగా శివసేన ఎమ్మెల్యే మహేంద్ర హరి, ఆర్జేడీ ఎమ్మెల్యే అనంత కుమార్ సింగ్ ఓటు హక్కుకు అనర్హులుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓట్ల లెక్కింపు జులై 21న ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది.
పార్లమెంట్‌లోని రూమ్ నెంబర్ 63లో పోలింగ్ జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్డి దేవగౌడ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవర్, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఓటు హక్కును వినియోగించుకు న్నారు. వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ఓటు హక్కును వినియోగించున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్యం కారణంగా వీల్ చైర్‌పై పార్లమెంట్‌కు వచ్చి ఓటు వేశారు. కరోనా సోకడంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కె సింగ్ పీపీఈ కిట్లు ధరించి ఓటు హక్కు వినియోగించుకున్నారు.