Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చర్చ జరగాల్సిందే : పార్లమెంట్లో ప్రతిపక్షాల డిమాండ్
- ఉభయ సభల్లో హోరెత్తిన నినాదాలు
- లోక్‌సభలో వెల్‌లోకి దూసుకెళ్లిన ప్రతిపక్ష ఎంపీలు
- జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకి పార్లమెంట్ నివాళి
- సభ్యుల ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ : సామాన్యుని నడ్డి విరిచే విధంగా దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న ధరలపై చర్చ జరగాలని పార్లమెంట్లో ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. నినాదాలతో హోరెత్తించాయి. దీంతో తీవ్ర గందరగోళం నెలకొనగా.. ఉభయ సభలూ వాయిదా పడ్డాయి. జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకి పార్లమెంట్ ఉభయసభలు తొలుత నివాళులర్పించాయి. అలాగే ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారంచేశారు. సోమవారం రాజ్యసభలో ధరలు పెరుగుదలపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అందుకు చైర్మెన్ ఎం.వెంకయ్యనాయుడు నిరాకరించారు. దీంతో ప్రతిపక్ష ఎంపీలు పెద్దఎత్తున నినాదాలుచేశారు. ధరల పెరుగుదలపై మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్‌చేశారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. వెంటనే సభను చైర్మెన్ వెంకయ్యనాయుడు నేటికి (మంగళవారం) వాయిదా వేశారు.
లోక్‌సభ కూడా ప్రారంభమైన కొద్దిసేపటికే మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో ధరల పెరుగుదలపై చర్చించాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్‌చేశారు. ప్లకార్డులు చేబూని వెల్‌లోకి దూసుకెళ్లి, నినాదాలతో హోరెత్తించారు. ప్రతిపక్షాల ఆందోళన నడుమ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఫ్యామిలీ కోర్టు సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాల ఆందోళనతో ప్రారంభమైన ఐదు నిమిషాలకే లోక్‌సభ నేటికి (మంగళవారం) వాయిదా పడింది. అంతకుముందు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ ఎంపీల సమావేశం జరిగింది. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
విజయసాయి రెడ్డి ప్రమాణ స్వీకారం
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభలో చైర్మెన్ వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. వైసీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి తెలుగులో, బీద మస్తాన్ రావు, నామినేటెడ్ ఎంపీ విజయేంద్ర ప్రసాద్‌లు ఇంగ్లీషులో ప్రమాణ స్వీకారంచేశారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేతలు పి.చిదంబరం, రణదీప్ సుర్జేవాలా, రాజీవ్ శుక్లా, శివసేన నేత సంజరు రౌత్, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, ఆప్ నేత, మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ తదితరులు ప్రమాణ స్వీకారంచేశారు. అనంతరం చైర్మెన్ ఎం.వెంకయ్యనాయుడు ప్యానల్ డిప్యూటీ చైర్మెన్లుగా విజయసాయి రెడ్డితో పాటు మరికొంత మంది పేర్లను కూడా ప్రకటించారు.
సభ్యులంతా చర్చల్లో పాల్గొనాలి : ప్రధాని మోడీ
పార్లమెంట్ సమావేశాల్లో సభ్యులంతా చర్చల్లో పాల్గొనాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. పార్లమెంటు ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. బయట వాతావరణం చల్లబడటం లేదనీ, సభలోపల వేడి తగ్గుతుందో లేదో చూడాలని చమత్కరించారు. వర్షాకాల సమావేశాలు అర్థవంతంగా జరుగుతాయని భావిస్తున్నానని అన్నారు. ఈ సమావేశాల్లోనే కొత్త రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి రాబోతున్నారని తెలిపారు. సభ్యులందరూ లోతైన చర్చలు జరపవలసిందిగా కోరుతున్నానన్నారు. పార్లమెంటులో చర్చలు, విమర్శలు జరగాలన్నారు.