Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీతో పాటు మరి కొన్ని రాష్ట్రాలపై విమర్శలు
- కేంద్ర వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ . శ్రీలంక సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షపాలిత రాష్ట్రాలపై కేంద్ర మంత్రులు దాడికి దిగారు. ఉద్దేశపూర్వకంగానే బీజేపేతర రాష్ట్రాలపై దాడి చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. మంగళవారం పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి 46 పార్టీలను ఆహ్వానిస్తే, 28 పార్టీల నుంచి 38 మంది నాయకులు హాజరయ్యారు. ఎనిమిది మంది కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రాలు వారీగా రాబడి పోలిక, జీఎస్డీపీకి బాధ్యతలు, వివిధ రాష్ట్రాల వృద్ధి రేటు, బాధ్యత, ఆయా రాష్ట్రాలు చేసిన రుణాలు, ఆస్తులను తనఖా పెట్టడం వంటి అంశాలకు సంబంధించిన ప్రెజెంటేషన్‌ను చేశారు. జెన్కామ్లు, డిస్కమ్‌లకు చెల్లించని విద్యుత్ బకాయిలు, రాష్ట్రాలు కలిగిన ఉన్న బకాయి హామీలపై చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, తమిళనాడు రాష్ట్రాలతో పాటు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు చేస్తున్న అప్పులపై విమర్శలు చేశారు. దీనిపట్ల ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. మొదట అభ్యంతరం తెలిపిన వారిలో టీఆర్ఎస్, డీఎంకే, టీఎంసీతో సహా ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీకి చెందిన ఎంపీ మిథున్ రెడ్డి, ఇతర ప్రతిపక్షాలు చేరాయి. సందర్భం లేకుండా రాష్ట్రాల అప్పులపై ప్రజెంటేషన్ ఏంటి అని నిలదీశాయి.సమావేశ అనంతరం కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ మాట్లాడుతూ శ్రీలంకలో చాలా తీవ్రమైన సంక్షోభం ఉందని, భారత దేశం తన పొరుగు దేశంలో భాగంగా చాలా మానవీయ కోణంలో ఆ దేశాన్ని సంప్రదించామని తెలిపారు. శ్రీలంక పరిస్థితి గురించి భారత్ ఆందోళన చెందుతుందని అన్నారు. శ్రీలంకకు 3.8 బిలియన్ డాలర్ల మద్దతును ఇండియా అందించిందని, మరే ఇతర దేశం ఈ స్థాయిలో మద్దతు ఇవ్వలేదని అన్నారు. శ్రీలంక ఏడు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. ఆర్థిక వివేకరం, సుపరిపాలనపై శ్రీలంక నుంచి గొప్ప పాఠాలు నేర్చుకోవాలని, అయితే మనకు ఆ రెండూ చాలా పుష్కలంగా ఉన్నాయని అన్నారు. ఈ సమావేశంలో మత్స్యకారుల సమస్య కూడా ప్రస్తావనకు వచ్చిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలు కె. కేశవరావు, లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం అప్పులపై వారు నిలదీశారు. తలసరి ఆదాయంలో దేశంలోనే రెండో స్థానంలో తెలంగాణ ఉందని తెలిపారు. కేవలం ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల అప్పులు గురించే మాట్లాడడం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.