Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందోళన
- అగ్నిపథ్‌పై సీపీఐ(ఎం) ఎంపీ నోటీసు
- వాయిదాల పర్వంలో ఉభయ సభలు
- గాంధీ విగ్రహం వద్ద ప్రతిపక్షాల నిరసన
న్యూఢిల్లీ : ధరల పెరుగుదలను నియంత్రించాలనీ, ఆహార పదార్థలపై విధించిన 5శాతం జీఎస్టీని తగ్గించాలని పార్లమెంటులో ప్రతిపక్షాలు ఆందోళనచేశాయి. ప్లకార్డులు చేబూని పెద్దఎత్తున నినాదాలుచేశారు. దీంతో ఉభయ సభలూ వాయిదా పర్వంతొక్కాయి. రాజ్యసభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు మంగళవారం ఆందోళన చేపట్టారు. దీంతో చైర్మెన్ వెంకయ్య నాయుడు సభ ప్రారంభమైన ఐదు నిమిషాలకే వాయిదా వేశారు. తిరిగి మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన సభలోనూ ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. ప్రతిపక్షాల ఆందోళనల నడుమ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జయశంకర్ ఆయుధాలతో భారీ విధ్వంసం, వాటి పంపిణీ వ్యవస్థలు (చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిషేధం) చట్టం సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అయినప్పటికీ ప్రతిపక్ష ఎంపీలు వెనక్కి తగ్గలేదు. తమ ఆందోళనను కొనసాగించారు. వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. దీంతో డిప్యూటీ చైర్మెన్ హరివంశ నారాయణ్ సింగ్ సభను నేటి (బుధవారం)కి వాయిదా వేశారు. మళ్లీ సభ ప్రారంభమైన ఐదు నిమిషాలకే వాయిదా పడింది. మంగళవారం రాజ్యసభ కేవలం పది నిమిషాలే జరిగింది.
లోక్‌సభలో..
లోక్‌సభలో కూడా అదే పరిస్థితి నెలకొంది. సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. ధరలు పెరుగుదలపై చర్చ పెట్టాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులు చేబూని వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళనచేశారు. మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలుచేశారు. ప్రతిపక్షాల ఆందోళన నడుమ ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. అయినప్పటికీ ప్రతిపక్షాలు వెనక్కి తగ్గలేదు. తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేశారు. సభ ప్రారంభమైన 12 నిమిషాలకే వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో సభ ప్రారంభమైన ఐదు నిమిషాలకే బుధవారానికి వాయిదా పడింది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీసే పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపుదల అంశంపై డీఎంకే రాజ్యసభ ఎంపీ తిరుచ్చి శివ, ధరలు పెరుగుదల, నిత్యావసర వస్తువులపై 5శాతం జీఎస్టీ విధించడంపై నోటీసులు ఇచ్చారు. అగ్నిపథ్ పథకంపై సీపీఐ(ఎం) ఎంపీ ఎఎ రహీం నోటీసు ఇచ్చారు. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ వాయిదా తీర్మానం ఇచ్చారు.
గాంధీ విగ్రహం వద్ద..
ధరల పెరుగుదలపై ప్రతిపక్షపార్టీలు పార్లమెంట్లో ఆందోళనచేశాయి. మంగళవారం పార్లమెంట్ ఆవరణంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టాయి. ప్లకార్డు చేబూని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, అధిర్ రంజన్ చౌదరి (కాంగ్రెస్), ప్రియాంక చతుర్వేది (శివసేన), ఎలమారం కరీం (సీపీఐ(ఎం)), బినరు విశ్వం (సీపీఐ) తదితరులు పాల్గొన్నారు. నిరసనలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, కొన్ని నిత్యావసర వస్తువుల జీఎస్టీ రేట్ల పెంపునకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చాయనీ, పోరాటం కొనసాగిస్తామని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సింగపూర్ వెళ్లకుండా అడ్డుకోవడంపై ఆప్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. అలాగే ఆహార ఉత్పత్తులపై 5శాతం జీఎస్టీ విధించడాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు కూడా ఆందోళన చేపట్టారు.