Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్మీ ఎంపిక ప్రక్రియ సమూలంగా మారుతుంది : రాజకీయ విశ్లేషకులు
- హిందూత్వను బలోపేతం చేయటమే తెరవెనుక లక్ష్యం..
- ప్రజలు తిరగబడితే...అణచివేయడానికి కొత్త సైన్యం ఏర్పాటు
- ఆర్ఎస్ఎస్ శాఖలు, అనుబంధ స్కూల్స్‌లో చదివినవారిని ఎంపిక చేసే ఛాన్స్ !
న్యూఢిల్లీ : కేంద్రం తీసుకొచ్చిన 'అగ్నిపథ్ పథకం'పై అనుమానాలు బలపడుతున్నాయి. రాజకీయంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్..రాష్ట్రాల్లో యువత వేలాదిమంది రోడ్లమీదకు వచ్చి నిరసనకు దిగారు. అగ్నిపథ్ ఆలోచనను విరమించుకోవాలని వామపక్షాలు, కాంగ్రెస్..సహా వివిధ రాజకీయ పార్టీలు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. అయినా మోడీ సర్కార్ ఏకపక్ష ధోరణితో ముందుకెళ్తోంది. ఈ ఏడాది త్రివిధ దళాల్లో నియామక ప్రక్రియ సైతం చేపట్టింది. ఏదో ఒకనాడు అగ్నిపథ్ పథకం..భారత ప్రజాస్వామ్యానికి మరణశాసనంగా మారుతుందని ప్రజాస్వామ్య వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో హిందూత్వ రాజకీయాలు బలోపేతమవ్వడానికి అగ్నిపథ్ దోహద పడుతుందని, ప్రధానిగా మోడీ అధికారం సుదీర్ఘకాలం కొనసాగడానికి కొత్త సైనిక వ్యవస్థను (అగ్నిపథ్ రూపంలో) తీసుకొస్తున్నారని అన్నారు.
ఆర్మీపై పట్టుకోసమే
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో ఆ రాష్ట్ర సీఎంగా నరేంద్రమోడీ అధికారంలో ఉన్నారు. ఆయన నేతృత్వంలో రాష్ట్ర పోలీసులు అల్లర్లను ఆపలేదు. దాంతో వేలాది ముస్లిం మైనార్టీలు కాషాయ మూకల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ప్రధాని పదవి చేపట్టాక..ఇప్పుడు ఢిల్లీ పోలీసుల వైఖరి కూడా అలాగే మారింది. సీబీఐ, ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ)..ఏ విధంగా నడుస్తున్నాయో దేశమంతా చూస్తోంది. ఇకముందు ఆర్మీ పనితీరూ అలాగే మారుతుందని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఆయా రంగాల ప్రముఖులు, హక్కుల కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమోషన్ల ప్రక్రియను తమకు అనుకూలంగా మలుచుకున్న మోడీసర్కార్, ప్రతిపక్షాలపైకి ఎన్ఐఏ, సీబీఐలను ఉసిగొలుపుతోంది. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని కూల్చుతోంది. పాలకుల్ని విమర్శించే జర్నలిస్టులు, పౌర హక్కుల కార్యకర్తలపై ఉపా చట్టాన్ని ప్రయోగించి అరెస్టు చేస్తోంది. ఇక్కడితోనే మోడీ సర్కార్ ఆగదని, ఆర్మీపై పట్టు సాధించేందుకు 'అగ్నిపథ్ పథకానికి' రూపకల్పన చేశారని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
పాత ఆర్మీ ఉండొద్దనే..
భారత సైన్యాన్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు అగ్నిపథ్‌ను తీసుకొస్తున్నామని మోడీ సర్కార్ చెప్పుకుంటోంది. ఆధునీకరణ, పునరు జ్జీవనం..వంటి మాటలు వినిపించింది. గత 8ఏండ్లుగా మోడీ సర్కార్ పాలన చూసినవారెవరూ పై మాటలు నమ్మటం లేదు. భారత సైన్యం ఇప్పుడున్న స్వరూపం, పనితీరు, స్వభావాన్ని సమూలంగా మార్చేయటమే మోడీ సర్కార్ అసలైన ఎజెండా అని ఢిల్లీ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మతతత్వం, హిందూత్వ రాజకీయాలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబుకిన సమయాన, ప్రజాస్వామ్యం కోసం ప్రజలంతా ఒక్కటైన రోజు..'కొత్త ఆర్మీ నమూనా' తమకు ఆయుధంగా మారుతుందని మోడీ సర్కార్ వ్యూహం. ఈ దేశంలో సమాఖ్య వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయాలని బీజేపీ కంకణం కట్టుకుంది. దీనికి వ్యతిరేకంగా రాష్ట్రాల నుంచి ప్రతిఘటన మొదలైనవేళ, వీరికి రాష్ట్ర పోలీసులు తోడైతే..ఘర్షణ తప్పదు. అప్పుడు 'కొత్త సైన్యా'న్ని వారిపైకి కేంద్రం ప్రయోగిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
బీజేపీ కోసమే పనిచేయాలి...
అగ్నిపథ్ పథకం ఎంపిక విధానం వివాదస్పదంగా మారింది. 100మంది అగ్నివీరుల్లో కేవలం 25శాతం మందిని మాత్రమే శాశ్వత నియామకానికి ఎంపికవుతారు. విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, అనుబంధ పాఠశాలల్లో చదివినవారు, బలమైన హిందూత్వ మూలాలున్న వారిని '25శాతం' మందిలో చేర్చుతారనే వాదన కూడా ఉంది. వీరికి సైన్యంలో వివిధ విభాగాల్లో శిక్షణ ఇచ్చి, కీలకమైన స్థానాల్లో నియమిస్తారని విమర్శలున్నాయి. హిందూత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చెలరేగిన సమయాన, దానిని అణచివేయడానికి 'అగ్నిపథ్' దోహదపడుతుందని మోడీ సర్కార్ బలంగా భావిస్తోంది. అందువల్లే అగ్నిపథ్‌ను ఉపసంహరించుకోవాలని రాజకీయవాదులు, హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఏదోఒకనాడు భారత ప్రజాస్వామ్యానికి 'అగ్నిపథ్' కచ్చితంగా మరణశాసనంగా మారుతుందని వారు అంటున్నారు.