Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగు చట్టాలకు అనుకూలమైనవారే అందులో ఉన్నారు..
- ఈ కమిటీని తిరస్కరిస్తున్నాం : ఎస్కేఎం
న్యూఢిల్లీ : ఎంఎస్పీ, ఇతర సమస్యలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) తిరస్కరించింది. ఆ కమిటీలో తమ ప్రతినిధులను నియమించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్కేఎం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ ప్రతినిధులు, దాని విధేయులతో నిండిన ఈ కమిటీ ఎజెండాలో ఎంఎస్పీ చట్టం గురించి చర్చించడానికి అవకాశం ఉండదని పేర్కొంది. ఈ కమిటీ గురించి ఎస్‌కేఎంకు ఉన్న భయాలన్నీ ఇప్పుడు నిజమని తేలిందని, అలాంటి రైతు వ్యతిరేక కమిటీతో ఎస్‌కేఎంకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ కమిటీకి పేర్ల కోసం ఎస్‌కేఎంను ప్రభుత్వం అడిగినప్పుడు.. దీనిపై ప్రభుత్వం నుంచి వివరణ కోరిందని గుర్తు చేసింది. దానికి ఇప్పటి వరకు సమాధానం రాలేదని పేర్కొంది. 'ఈ కమిటీ అధికార పరిధిని, నిబంధనలను ప్రభుత్వం స్పష్టం చేస్తే తప్ప, ఈ కమిటీకి ఎస్కేఎం ప్రతినిధిని నామినేట్ చేయడంలో అర్థం లేదని జూలై 3న ఎస్కేఎం జాతీయ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది' అని తెలిపింది. ఈ కమిటీపై తమకున్న సందేహాలన్నీ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌తో నిజమయ్యాయనీ, సహజంగానే, అటువంటి రైతు వ్యతిరేక, అర్థంలేని కమిటీకి ఎస్కేఎం ప్రతినిధులను పంపడంలో హేతుబద్ధత లేదని పేర్కొంది.
పార్లమెంట్ సమావేశాలకు ముందే ఈ కమిటీని ప్రకటించడం వల్ల ప్రభుత్వం కాగితాల్లో చెప్పినది పూర్తి చేసేందుకు ప్రయత్నించిందనీ, కానీ ఈ కమిటీ వెనుక ప్రభుత్వ దురుద్దేశాలు, కమిటీ అసందర్భతను నోటిఫికేషన్ స్పష్టం చేస్తుందని పేర్కొంది. మూడు రైతు వ్యతిరేక చట్టాలను రూపొందించిన మాజీ వ్యవసాయ కార్యదర్శి సంజరు అగర్వాల్ కమిటీకి చైర్మన్‌గా ఉన్నారనీ, ఈ మూడు చట్టాల ప్రధాన కారకుడు అయిన నిటి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ ఆయనతో పాటు ఉన్నారని తెలిపింది. నిపుణులుగా ఎంఎస్పీకి చట్టపరమైన హోదా ఇవ్వడాన్ని వ్యతిరేకించిన ఆర్థికవేత్తలు కమిటీలో ఉన్నారని పేర్కొంది. కమిటీలో ఎస్‌కేఎంకు సంబంధించి ముగ్గురు సభ్యులకు అవకాశం ఇచ్చిందనీ, అయితే ఇతర రైతు సంఘాల పేరుతో రైతు చట్టాలను బహిరంగంగా సమర్థించి ప్రభుత్వానికి విధేయులుగా ఉన్న ఐదుగురుని కమిటీ సభ్యులుగా చేర్చిందని తెలిపింది. ఈ వ్యక్తులందరూ నేరుగా బీజేపీ, ఆర్ఎస్ఎస్తో సంబంధం కలిగి ఉన్నారనీ తెలిపింది. కృష్ణ వీర్ చౌదరి బీజేపీ నాయకుడనీ, భారతీయ రైతు సొసైటీతో అనుబంధం కలిగి ఉన్నారనీ, సయ్యద్ పాషా పటేల్ మహారాష్ట్రకు చెందిన మాజీ బీజేపీ ఎమ్మెల్సీ అనీ, ప్రమోద్ కుమార్ చౌదరి ఆర్ఎస్ఎస్ అనుబంధ భారతీయ కిసాన్ సంఫ్‌ు జాతీయ కార్యవర్గం సభ్యుడనీ, గున్వంత్ పాటిల్ షెట్కారీ సంస్థతో సంబంధం కలిగి ఉన్నారనీ తెలిపారు. రైతుల ఉద్యమాన్ని వ్యతిరేకించిన గుని ప్రకాష్ సభ్యుడిగా ఉన్నారని తెలిపారు. ఈ ఐదుగురు వ్యక్తులు మూడు రైతు వ్యతిరేక చట్టాలకు అనుకూలంగా బహిరంగంగా మాట్లాడారనీ, వారిలో ఎక్కువ మంది రైతుల ఉద్యమానికి వ్యతిరేకంగా విషం చిమ్ముతున్నారని ఎస్‌కెఎం పేర్కొంది. ఈ కమిటీ ఎజెండాలో ఎంఎస్పిపై చట్టం చేసే ప్రస్తావన లేదనీ విమర్శించింది.