Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం లోక్సభ సెక్రటేరియట్లో రాహుల్ గాంధీ, శరద్ పవర్, సీతారాం ఏచూరి తదితరుల సమక్షంలో మార్గరెట్ అల్వా నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్, లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో డి.రాజా, బినరు విశ్వం (సీపీఐ), మల్లికార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, జైరాం రమేష్ (కాంగ్రెస్), తిరుచ్చి శివ (డీఎంకే), ఎలమారం కరీం (సీపీఐ(ఎం)), సంజరు రౌత్ (శివసేన), మనోజ్ కుమార్ ఝా (ఆర్జేడీ), రాంగోపాల్ యాదవ్ (ఎస్పీ), ఎన్కె ప్రేమ్ చంద్రన్ (ఆర్ఎస్పీ), తిరువలవన్ (వీసీకే), వైకో (ఎండీఎంకే), మహ్మద్ బషీర్ (ఐయూఎంఎల్) తదితరులు పాల్గొన్నారు. అనంతరం మార్గరెట్ అల్వా మాట్లాడుతూ ప్రజాస్వామ్య మూలస్తంభాల కోసం పోరాడతానని చెప్పారు. 'నా అభ్యర్థిత్వానికి మద్దతుగా ప్రతిపక్షాలు కలిసి రావడం... భారతదేశమనే వాస్తవికతకు ఒక రూపం. మేము ఈ గొప్ప దేశంలోని వివిధ మూలల నుంచి వచ్చాం. వివిధ భాషలు మాట్లాడుతాం. వివిధ మతాలు, ఆచారాలను అనుసరిస్తాం. భిన్నత్వంలో ఏకత్వమే మన బలం' అన్నారు. 'ఈ 50 ఏండ్లలో నేను నా దేశం సమగ్రత కోసం ధైర్యంగా నిబద్ధతతో పనిచేశాను. నిర్భయంగా సేవ చేయడమే నా ఏకైక బాధ్యత' అన్నారు.
ముగిసిన నామినేషన్ల పర్వం...నేడు పరిశీలన
ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. నేడు (బుధవారం) నామినేషన్లు పరిశీలించనున్నారు. లోక్సభ సెక్రటేరియట్ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు 50 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అందులో ఏపీకి చెందిన నాయుడుగారి రాజశేఖర్ (శ్రీకాకుళం), మండాటి తిరుపతి రెడ్డి (ప్రకాశం) కూడా నామినేషన్లు దాఖలు చేశారు. ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన పోలింగ్ జరగనుంది.