Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత మంత్రి రాజీనామా
లక్నో : రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత తనకు ఎదురే లేదని విర్రవీగిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్‌కు బుధవారం షాక్ మీద షాక్ తగిలాయి. యోగి వివక్షా పూరిత, నిరంకుశ పోకడలతో విసిగి పోయిన ఓ దళిత మంత్రి తన పదవికి రాజీనామా చేయగా, మరో అసంతృప్త మంత్రి ఢిల్లీకి వెళ్లి బీజేపీఅధినాయకత్వం వద్ద గోడు వెళ్లబోసుకు న్నారు. దళితుడ్ని అన్న ఒకే ఒక కారణంతో ముఖ్యమంత్రి తనను చులకనగా చూస్తున్నారని, ఇది తనను ఎంతగానో బాధించిందని జల వనరుల శాఖ మంత్రి దినేష్ ఖతిక్ ఆవేదన వ్యక్తం చేశారు. గత 100 రోజులుగా తనకు ఏ పనీ అప్పగించడం లేదు, తన మంత్రిత్వశాఖకు సంబంధించిన అంశాలపై తనను సంప్రదించ కుండానే వారే నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఈ పరిస్థితుల్లో మంత్రివర్గంలో కొనసాగి ఉపయోగం లేదన్న ఉద్దేశంతోనే తప్పుకుంటున్నానని మంత్రి దినేష్ అన్నారు. అయితే, ఆయన ఆ లేఖను ముఖ్యమంత్రికి కాకుండా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు పంపారు. ఆయన చేత రాజీనామా ఉపసంహరించుకోవాలని పార్టీలోని కొందరు ఒత్తిడి పెంచుతున్నారు. ఇదిలా వుండగా యుపి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీిలోకి ఫిరాయించి, మంత్రి పదవి దక్కించుకున్న జితిన్ ప్రసాద కూడా యోగి నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు.