Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్కూల్ డ్రెస్ విప్పేయాలని దళిత విద్యార్థులపై ఒత్తిడి
- ఫొటోల కోసం ఇతర విద్యార్థులకు యూనిఫాం ఇప్పించిన టీచర్లు
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. హాపుర్ఫర్లోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో స్కూల్ డ్రెస్ విప్పేయాలంటూ దళిత విద్యార్థులను కొంతమంది టీచర్లు కొట్టారని ఆరోపణలు వెలువడ్డాయి. జులై 11న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ రోజు స్కూల్ యూనిఫామ్స్ వేసుకొచ్చిన విద్యార్థుల ఫొటోలు తీసే కార్యక్రమం ఏర్పాటుచేశారు. సాధారణ దుస్తుల్లో వచ్చిన ఇతర విద్యార్థుల ఫొటోగ్రాఫ్ కార్యక్రమం ఆగిపోయింది. ఫొటోల కోసం వారికి స్కూల్ యూనిఫాం ఇవ్వాలని దళిత విద్యార్థులను ఉద్దేశపూర్వకంగా కొంతమంది టీచర్లు ఒత్తిడి చేశారని, నిరాకరించిన విద్యార్థుల్ని కొట్టారని తెలిసింది. ఈ విషయం ఇంటికి పోయిన తర్వాత బాధిత విద్యార్థులు వారి తల్లిదండ్రులకు చెప్పటంతో విషయం బయటకు పొక్కింది. 'ఇదెక్కడి న్యాయం. ఫొటోలు తీస్తున్నారని మా పిల్లల స్కూల్ డ్రెస్ విప్పించి, దానిని వేరే విద్యార్థులకు ఇవ్వటం ఏంటి? మరో అమ్మాయికి స్కూల్డ్రెస్ ఇవ్వాలని..మా అమ్మాయిని టీచర్లు బెదిరించారు. అలా చేయనని మా అమ్మాయి చెప్పింది. దాంతో టీచర్ మా అమ్మాయిని కొట్టి, బెదిరించి..స్కూల్ డ్రెస్ విప్పించారు. దీనిపై స్కూల్కు వెళ్లి ఫిర్యాదుచేస్తే..అక్కడ స్పందన లేదు'' అంటూ బాధిత విద్యార్థి తండ్రి ఒకరు వాపోయారు. మరో విద్యార్థి తండ్రి విషయాన్ని హాపూర్ జిల్లా ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లారు. టీచర్లు ఉద్దేశపూర్వకంగా దళిత విద్యార్థుల పట్ల వ్యవహరించారని ఆయన ఆరోపించారు. ఘటనకు బాధ్యులైన టీచర్లపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు కాగా, టీచర్లను పిలిపించి విచారణ చేశారు. బాధిత తల్లిదండ్రులు చేసిన ఆరోపణల్ని టీచర్లు కొట్టిపారేశారు. తామెవర్నీ బలవంత పెట్టలేదని, కొట్టలేదని టీచర్లు చెప్పారు.