Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పురుషులతో పోల్చుకుంటే మూడు రెట్లు ఎక్కువ : ఎన్ఎస్ఓ సమాచారం
న్యూఢిల్లీ : భారత్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగాల్లో మహిళల సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో పెరుగుదల వేగంగా ఉన్నది. ఇది భారత్‌లోనూ గత కొన్ని దశాబ్దాలుగా పార్ట్‌టైమ్ ఉద్యోగాల్లో మహిళల సంఖ్య పెరుగుదలకు దారి తీసింది. పురుషులతో పోల్చుకుంటే మూడు రెట్లు అధికంగా ఉన్నది. 2017-18 నుంచి 2019-20 ఏడాది వరకు గల సమాచారాన్ని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్ఓ) తన నివేదికల్లో వెల్లడించింది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే సమాచారం నుంచి ఎన్ఎస్ఓ ముఖ్యంగా మూడు కార్మిక సూచికలను రూపొందించింది. ఎన్ఎస్ఓ నివేదిక సమాచారం ప్రకారం.. శ్రామిక జనాభాలో (15 ఏండ్లు పైబడినవారు) పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసే పురుషుల సంఖ్య 7 నుంచి 8 శాతంగా ఉన్నది. ఈ సమయంలో మహిళ సంఖ్య 23-24 శాతం మధ్య నమోదు కావటం గమనార్హం. పట్టణ ప్రాంతాల్లో పార్ట్‌టైమ్ ఉద్యోగాల్లో పురుషుల సంఖ్య 3-4 శాతం ఉండగా.. మహిళల సంఖ్య 15-16 శాతంగా ఉన్నది.
కనీసం మూడేండ్లలోపు వయస్సున్న ఒక్క చిన్నారిని కలిగి ఉండి పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తున్న మహిళల కంటే.. మూడేండ్ల వయస్సు లోపు చిన్నారులను కలిగి లేని 25-49 ఏండ్ల వయస్సు మధ్య గల గ్రూపులోని మహిళల్లో చాలా మంది పార్ట్‌టైమ్ ఉద్యోగాల్లో ఉన్నారు. చిన్నారులు లేని 25-49 ఏండ్ల మధ్య వయస్సున్న మహిళల్లో 2017-18 లో ఉపాధి రేటు 58.37 శాతంగా ఉన్నది. 2019-20కి అది 61.2 శాతానికి పెరిగింది. మూడేండ్లలోపు చిన్నారిని కలిగి ఉన్న ఇంటిలో పురుషులకు సంబంధించిన ఉపాధి రేటులో మాత్రం ఎలాంటి మార్పూ కనిపించలేదు. 2017-18 నుంచి 2019-20 మధ్య 46-59 ఏండ్ల మధ్య వయస్సు కలిగిన గ్రూపులో పార్ట్‌టైమ్‌గా పని చేస్తున్న ఉద్యోగుల నిష్పత్తి 10 శాతం అధికంగా ఉన్నది. 60 ఏండ్లు పైబడిన గ్రూపుతో పోలిస్తే 15శాతం కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. అయితే ఇలాంటి పార్ట్‌టైమ్ ఉద్యోగాలు ఫుల్‌టైమ్ ఉద్యోగాలతో పోలిస్తే ఆర్థికంగా భద్రతను, స్థిరత్వాన్ని కలిగి ఉండవని ఎన్ఎస్ఓ తెలిపింది.