Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిత్యావసర వస్తువులపై జీఎస్టీ విధించడాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా
- పార్లమెంటులో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ప్రతిపక్షాల ఆందోళన
- దద్దరిల్లిన ఉభయ సభలు
న్యూఢిల్లీ : ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువులపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పెంపునకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు వినూత్న రీతులో ఆందోళన చేపట్టాయి. బుధవారం పార్లమెంట్ ఆవరణంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ప్రతిపక్షాలు పాలు, పెరుగు, రొట్టె, పన్నీర్, గ్యాస్ సిలిండర్లతో పాటు ప్లకార్డుల చేబూని ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, టీఆర్ఎస్, సీపీఐ(ఎం), సీపీఐ, నేషనల్ కాన్ఫెరెన్స్, ఎండీఎంకే తదితర పార్టీల ఎంపీలు ఆందోళన చేశారు. జీఎస్టీ రద్దు చేయాలనీ, గ్యాస్ ధరలు తగ్గించాలని నినాదాల చేశారు. 'గబ్బర్‌సింగ్ ట్యాక్స్ స్ట్రైక్స్ మళ్లీ' అంటూ బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి (కాంగ్రెస్), కనిమొళి (డీఎంకే), నామా నాగేశ్వరరావు, కె.కేశవరావు (టీఆర్ఎస్), ఎలమారం కరీం (సీపీఐ (ఎం)), బినరు విశ్వం (సీపీఐ), ఫరూక్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫెరెన్స్), వైకో (ఎండీఎంకే) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ఆహార వస్తువులపై జీఎస్టీ పెంచటంతో దేశంలోని సామాన్య ప్రజలపై తీవ్రమైన భారం పెరుగుతుందని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ లన్నీ పార్లమెంట్ లోపల, వెలుపల ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు.
దద్దరిల్లిన ఉభయ సభలు
ద్రవ్యోల్బణం, జీఎస్టీ రేట్లపై పార్లమెంటులో చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అందుకు ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడంతో ఉభయ సభల్లో ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. పాలు, పెరుగు ప్యాకెట్లతో వెల్‌లో ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేబూని నినాదాలు హోరెత్తించారు. ప్రతిపక్షాల నినాదాలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. బుధవారం రాజ్యసభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించడంపై చర్చించాలని పట్టుపట్టాయి. దీనికి ప్రభుత్వం ససేమీరా అనడంతో ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభ ప్రారంభమైన ఆరు నిమిషాలకే వాయిదా పడింది. తిరిగి మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన సభలో కూడా ప్రతిపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు. దీంతో సభ ప్రారంభమైన నాలుగు నిమిషాలకే డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ గురువారానికి వాయిదా వేశారు. మరోవైపు లోక్‌సభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు సభ కేవలం ఆరు నిమిషాలు పాటే జరిగి నేటీ (గురువారం)కి వాయిదా పడింది.