Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎస్టీ విధించం : కేరళ సర్కార్
- కేంద్రంతో సమస్య వచ్చినా రాజీపడం :కేరళ ఆర్థిక మంత్రి
తిరువనంతపురం : జీఎస్టీతో పన్నుల బాదుడుకు కేంద్రం తెరతీసింది. మోడీ సర్కారు తీరుపై ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి తరుణంలో కేరళ ప్రజలకు ఉపశమనం కలిగించేలా విజయన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. కుడుంబశ్రీ వంటి సంస్థలు, చిన్న దుకాణాలు అమ్మే వస్తువులపై జీఎస్టీ విధించబోమని తెలిపింది. ఈ నిర్ణయం కేంద్రంతో సమస్యలకు దారీ తీసే అవకాశమున్నదనీ, అయినప్పటికీ ఈ విషయంలో రాజీ పడబోమని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి కే.ఎన్. బాలగోపాల్ కేరళ అసెంబ్లీలో వెల్లడించారు. ''ఎలాగైనా, కేరళలో కుడుంబశ్రీ వంటి సంస్థలు లేదా చిన్న దుకాణాల్లో 1 లేదా రెండు కిలోల ప్యాకెట్లలో లేదా లూజుగా విక్రయించే వస్తువులపై పన్ను విధించాలని మేము భావించటం లేదు. ఈ నిర్ణయం ద్వారా కేంద్రంతో సమస్యలు తలెత్తుతాయి కూడా. మేము రాజీపడటానికి సిద్ధంగా లేము. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్రానికి తెలిపాం'' అని బాలగోపాల్ చెప్పారు. కేరళ ప్రభుత్వ వైఖరిపై కేంద్రానికి ఇప్పటికే లేఖ రాసినట్టు తెలిపారు. '' వీటికి సంబంధించి వారికి (కేంద్రానికి) సీఎం లేఖ రాశారు. మాకు చిన్న తరహా వ్యాపారులు, దుకాణాలపై పన్ను విధించే ఉద్దేశం లేదు. దీనిపై ఎలాంటి వాదనకూ తావుండదు'' అని కేరళ ఆర్థిక మంత్రి అన్నారు. ప్యాక్ చేసిన వస్తువులపై బ్రాండెడ్ కంపెనీలు ఐదు శాతం పన్నును చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అయితే, బ్రాండ్‌ను వెల్లడించటంలేదని ఒకవేళ వారు పేర్కొంటే పన్ను ఉండదని వివరించారు. కాగా, నిత్యవసర వస్తువులపై పన్ను విధించే అంశంలో ప్రధాని మోడీ తక్షణమే జోక్యం చేసుకోవాలని కేరళ సీఎం పినరయి విజయన్ కోరారు. ఈ నిర్ణయం సాధారణ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేరళలో మిల్లర్ల, చిన్న దుకాణాలు నడిపేవారు సైతం వస్తువులను ప్యాక్ చేసి విక్రయిస్తుంటారని తన లేఖలో సీఎం పేర్కొన్నారు. ఇక్కడ ప్యాక్ చేసి విక్రయించటమనేది సర్వసాధారణమని, ఇప్పుడు ఈ ప్యాక్ చేసిన వస్తువులపై జీఎస్టీ విధించటంతో వినియోగదారులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు.