Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిఏటా వడ్డీరేట్లను తగ్గిస్తూ వస్తున్న మోడీ సర్కార్
- చిన్నమొత్తాల పొదుపు పథకాలన్నింటిపైనా దెబ్బ
- కిసాన్ వికాస్‌కు వడ్డీరేటు 2015లో 8.7శాతం
- 2020లో 6.9శాతానికి కుదింపు
- ప్రస్తుతం 7.1శాతానికి పీపీఎఫ్ వడ్డీరేటు
ఎంతోమంది ఖాతాదార్లు పొద్దున్నే పోస్టాఫీసు లేదా బ్యాంకులకు వచ్చి వరుసలో నిలబడి పొదుపు ఖాతాల్లో లావాదేవీలు నిర్వహిస్తున్నారు. రూ.200, రూ.500..ఇలా జమచేస్తూ భవిష్యత్తు అవసరాలకు పనికొస్తుందని భావిస్తున్నారు. కిసాన్ వికాస్ పత్రాలు, రికరింగ్ డిపాజిట్స్, సీనియర్ సిటిజన్స్ పొదుపు, పీపీఎఫ్..పథకాల్ని కోట్లాదిమంది నమ్ముకున్నారు. అయితే మోడీ సర్కార్ వారి నమ్మకంపై కోలుకోనంత దెబ్బకొట్టింది. ప్రతిఏటా వడ్డీరేట్లకు కోతలు పెడుతోంది. రికరింగ్ డిపాజిట్‌పై వడ్డీరేటు 8.4శాతం నుంచి 5.8శాతానికి పడిపోయింది. ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకుంటే ఖాతాదార్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
న్యూఢిల్లీ : గత 8ఏండ్లుగా మోడీ సర్కార్ గారడీలు అన్నిరంగాల్నీ అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు దేశ ప్రజల్ని హడలెత్తిస్తున్నాయి. సామాన్యులు, మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా ఆధారపడ్డ 'చిన్న మొత్తాల పొదుపు'ను మెల్ల మెల్లగా కేంద్రం దెబ్బతీస్తోంది. మరోవైపు ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకొని వివిధ రకాల రుణాలపై వడ్డీరేట్లను అమాంతం పెంచేస్తోంది. ఉదాహరణకు బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో సీనియర్ సిటిజన్స్ పొదుపు ఖాతాలపై 2015లో వడ్డీ రేటు 9.3శాతం ఉండేది. 8ఏండ్లలో ఈ వడ్డీరేట్లకు కేంద్రం ఆరుమార్లు కోతలు పెట్టింది. ఆ ఖాతాలపై ప్రస్తుతం వడ్డీరేటు 7.4శాతానికి పడిపోయింది.
పొదుపు మొత్తాలపై వచ్చిన వడ్డీ ఆదాయం,అసలును..పెరిగిన ద్రవ్యోల్బణానికి లెక్కచూసుకుంటే ఖాతాదార్లకు నష్టమే తప్ప, లాభం ఉండటం లేదు. డిసెంబర్ 2011లో పోస్టాఫీస్ పొదుపు ఖాతా వడ్డీరేట్లు పెంచగా, 11ఏండ్లుగా వీటిలో మార్పులేదు. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది నుంచి ఆదరణ చూరగొన్న కిసాన్ వికాస పత్రాల పథకంలోనూ కేంద్రం తీరు దారుణంగా ఉంది. ఈ పథకంలో 2014లో వడ్డీరేటు 8.7శాతం ఉండగా, 2020నాటికి 6.9శాతానికి తగ్గించారు.
అన్నిట్లో తగ్గింపే..
పబ్లిక్ ప్రావిడెంట్ ఖాతా..పీపీఎఫ్. దీనిని పోస్టాఫీస్, బ్యాంకుల్లో ఎక్కడైనా, ఎవరైనా తెరవొచ్చు. ప్రతినెలా ఎంత చిన్నమొత్తమైనా దీంట్లో వేసుకోవచ్చు. పిల్లల ఉన్నత చదువు, ఆడపిల్ల వివాహం కోసం పనికొస్తుందని ఎన్నో కుటుంబాలు పీపీఎఫ్ ఖాతాను తెరిచాయి. 2013లో ఈ ఖాతాపై వడ్డీరేటు 8.7శాతం ఉండేది. దీనిని ప్రతిఏటా కేంద్రం తగ్గిస్తూ వస్తోంది. 2020లో వడ్డీరేట 7.1శాతానికి పడిపోయింది. స్వల్పకాలం కోసం రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) ఖాతాలు కూడా ఉన్నాయి. ఐదేండ్ల కాలంతో కూడిన ఈ ఆర్డీ ఖాతాలపై 2014లో వడ్డీ 8.4శాతం (వార్షిక) వచ్చేది. ఈ పొదుపు ఖాతాల వడ్డీరేట్లకు గత 8ఏండ్లలో కేంద్రం 7సార్లు కోతలు పెట్టింది. 2020నాటికి వడ్డీరేటు కేవలం 5.8శాతానికి పడిపోయింది. అలాగే జాతీయ పొదుపు సర్టిఫికెట్లు పథకంపై వడ్డీరేటు 8.5శాతం (2013లో) ఉండేది. దీనిని 2020నాటికి 6.8శాతానికి కుదించారు.
ద్రవ్యోల్బణం లెక్క చూసుకుంటే..
ఒక ఏడాది వ్యవధితో కూడిన నేషనల్ సేవింగ్ టైం డిపాజిట్ ఖాతాపై ఏడాదికి 8.4శాతం వడ్డీ వచ్చేది. రెండు, మూడేండ్ల, ఐదేండ్ల ఖాతాలపై వడ్డీ రేటు 8.5శాతం ఉండేది. ఈ వడ్డీ రేట్లను కేంద్రం 5.5శాతానికి తగ్గించింది. ఐదేండ్ల ఖాతాలపై 6.7శాతం చెల్లిస్తోంది. పోస్టాఫీస్ పొదుపు ఖాతాల్లో అత్యంత పాపులర్ అయిన మరో పథకం 'మంత్లీ స్కీం'. నెలవారీగా వడ్డీ రేటు చెల్లిస్తారు. ఈ పథకంలో 2016లో 7.8శాతం వడ్డీరేటు చెల్లించారు. గత ఐదేండ్లలో వడ్డీరేట్లకు కేంద్రం ఆరుసార్లు కోతలు పెట్టింది. 6.6శాతానికి కుదించింది. గతకొన్నేండ్లుగా ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో పెరుగుతూ పోతుందో అందరికీ తెలిసిందే. గత 8ఏండ్ల సగటు తీసుకున్నా ద్రవ్యోల్బణం 5శాతం పైన్నే ఉంది. దీనిని బట్టి చిన్నమొత్తాల పొదుపుపై ఖాతాదార్లకు వచ్చేది చాలా స్పల్పం.