Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భిన్నత్వంలో ఏకత్వమే మన బలం
- ప్రతిపక్షాలు కలిసి రావడం వాస్తవికతకు ప్రతిరూపం : ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వా
న్యూఢిల్లీ : బలమైన, ఐక్య భారతదేశ నిర్మాణం కోసం పనిచేస్తానని ఉపరాష్ట్రపతి స్థానానికి పోటీ చేసే ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వా స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఆమె ప్రకటన విడుదల చేశారు. భారత దేశంలో ఉపరాష్ట్రపతి స్థానానికి ఉమ్మడి అభ్యర్థిగా తనను ప్రతిపక్షాలు ఎంపిక చేయడం ఒక విశేషమనీ, గౌరవమని తెలిపారు. ప్రతిపక్షాల అభ్యర్థనను వినయంతో అంగీకరిస్తున్నానన్నారు. తనపై విశ్వాసం ఉంచిన ప్రతిపక్ష నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంటు ఉభయసభల సభ్యురాలిగా, కేంద్ర మంత్రిగా, గవర్నర్గా, ఐక్యరాజ్యసమితిలో భారతదేశం గర్వించదగ్గ ప్రతినిధిగా తాను యాభై ఏండ్లకు పైగా ప్రజా జీవితంలో గడిపినందుకు ప్రతిపక్షాలు తనకు ఈ బాధ్యత అప్పగించాయని తాను నమ్ముతున్నానన్నారు. ఐక్యరాజ్య సమితి, ఇతర ప్రపంచ వేదికల్లో మహిళ హక్కుల కోసం నిర్భయంగా మాట్లాడాననీ, దేశవ్యాప్తంగా వెనుకబడిన, అట్టడుగు వర్గాల కోసం పోరాడిన సంఘాలు తరపున నిలబడ్డానని తెలిపారు. ఈ యాభై ఏండ్లుగా తాను దేశ సమగ్రత కోసం ధైర్యంగా, నిబద్ధతతో పని చేశాననీ, భారత రాజ్యాంగానికి నిర్భయంగా సేవ చేయడమే తన ఏకైక బాధ్యతని పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే మన బలమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య మూలస్తంభాలను నిలబెట్టడానికి, మన సంస్థలను బలోపేతం చేయడానికి పని చేస్తామని స్పష్టంచేశారు. ఎన్నికలు తనను భయపెట్టవనీ, గెలుపు ఓటములు జీవితంలో ఒక భాగమని అన్నారు. ఏది ఏమైనప్పటికీ, పార్లమెంటు ఉభయ సభల్లో తాను సంపాదించిన పార్టీలకు అతీతంగా సభ్యుల సద్భావన, విశ్వాసం, ఆప్యాయత తనను చూస్తాయన్నారు.