Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 25న ప్రమాణ స్వీకారం
- మొత్తం పోలైన ఓట్లు : 4,754(10,72,377)
- చెల్లని ఓట్లు : 53(15,397)
- చెల్లిన ఓట్లు : 4,701(10,56,980)
- ద్రౌపది ముర్మకు వచ్చిన ఓట్లు : 2,824 (6,76,803)
- ద్రౌపది ముర్ముకు 64.03 శాతం
- యశ్వంత్ సిన్హాకు వచ్చిన ఓట్లు : 1,877 (3,80,177)
- యశ్వంత్ సిన్హాకు 35.97 శాతం
- మెజార్టీ : 2,96,626
- గెలవడానికి అవసరమైన ఓట్ల విలువ : 5,28,481
న్యూఢిల్లీ : దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. దీంతో దేశ అత్యున్నత పదవిలో మొదటి గిరిజన మహిళగా ఆమె నిలిచారు. 16వ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఈ నెల 18న జరిగింది. దానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు గురువారం జరిగాయి. మొత్తం నాలుగు రౌండ్లలో లెక్కింపు జరిగింది. ఓట్ల లెక్కింపు వివరాలను రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీ వెల్లడించారు. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు 2,824 (6,76,803) ఓట్లు పోలైనాయి. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 1,877 (3,80,177) ఓట్లు వచ్చాయి. యశ్వంత్ సిన్హాపై ద్రౌపది ముర్ము 2,96,626 ఓట్లు తేడాతో గెలిపొందారు. మొత్తం 4,754 ఓట్లు పోలైతే, అందులో 53 ఓట్లు చెల్లుబాటు కాలేదు. 4,701 ఓట్లు చెల్లుబాటు అయ్యాయని పిసి మోడీ తెలిపారు. ద్రౌపది ముర్ముకు అన్ని రాష్ట్రాల్లో ఓట్లు పడగా, యశ్వంత్ సిన్హాకు మూడు రాష్ట్రాల్లో (ఏపీ, నాగాలాండ్, సిక్కిం)ల్లో ఒక్క ఓటు కూడా పడలేదు. బీహార్ (2), హిమాచల్ ప్రదేశ్ (1), జార్ఖండ్ (1), కర్నాటక (4), మధ్యప్రదేశ్ (4), మహారాష్ట్ర (4), మేఘాలయా (1), పంజాబ్ (5), తమిళనాడు, (1), తెలంగాణ (1), ఉత్తరాఖండ్ (1), ఉత్తరప్రదేశ్ (3), పశ్చిమ బెంగాల్ (4), ఢిల్లీ (4), పుదుచ్చేరి (1), రాజ్యసభ, లోక్‌సభ ఎంపిలు (15) ఓట్లు చెల్లుబాటు కాలేదు.
రౌండ్ల వారీగా ఓట్లు...
మొదటి రౌండ్లో ఎంపీలు ఓట్లు లెక్కించారు. 763 ఓట్లలో 748 (5,23,600) ఓట్లు చెల్లిన ఓట్లు కాగా, 15 ఓట్లు చెల్లని ఓట్లు. అందులో ద్రౌపది ముర్ముకు 540 (3,78,000) ఓట్లు వచ్చాయి. ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 208 (1,45,600) ఓట్లు వచ్చాయి.
రెండో రౌండ్లో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, బీహార్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల ఓట్లు లెక్కించారు. ఆయా రాష్ట్రాల్లో 1,138 ఓట్లు ( 1,49,575) చెల్లుబాటు కాగా, అందులో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు 809 ఓట్లు (1,05,299) వచ్చాయి. ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 329 ఓట్లు (44,276) వచ్చాయి. రెండో రౌండు పూర్తి అయ్యే సరికి 1,886 ఓట్ల (విలువ 6,73,175)లో ద్రౌపది ముర్ముకు 1,349 ఓట్లు (4,83,299) వచ్చాయి. యశ్వంత్ సిన్హాకు 537 ఓట్లు (1,89,876) వచ్చాయి. మూడో రౌండ్లో కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయా, మిజోరం, నాగాలాండ్, ఒరిస్సా, పంజాబ్ రాష్ట్రాల ఓట్లు లెక్కించారు. ఆయా రాష్ట్రాల్లో 1,333 ఓట్లు (1,65,664) చెల్లుబాటు కాగా అందులో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు 812 ఓట్లు (94,478) వచ్చాయి. ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 521 ఓట్లు (71,186) వచ్చాయి. మూడో రౌండ్ ముగిసే సరికి 3,219 ఓట్లు (8,38,839) ఓట్లు చెల్లుబాటు కాగా, ద్రౌపది ముర్ముకు 2,161 ఓట్లు (5,77,777), యశ్వంత్ సిన్హాకు 1,058 ఓట్లు (2,61,062) వచ్చాయి. మూడో రౌండ్ పూర్తి అయ్యే సరికి ద్రౌపది ముర్ము 53.12 శాతం ఓట్లు సాధించారు. దీంతో ఆమె మ్యాజిక్ ఫిగర్ 5,28,491 ఓట్ల విలువను దాటేశారు.నాలుగో రౌండ్లో రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరి ఓట్లు లెక్కించారు. ఆయా రాష్ట్రాల్లో 1,482 (2,18,141) చెల్లుబాటు కాగా, అందులో ద్రౌపది ముర్ముకు 663 (99,026) ఓట్లు రాగా, యశ్వంత్ సిన్హాకు 819 (1,19,115) ఓట్లు వచ్చాయి. ద్రౌపది ముర్ము విజయం సాధించడంతో అన్ని దేశ రాజధాని ఢిల్లీతో సహా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నారు.
పలువురు శుభాకాంక్షులు
ద్రౌపది ముర్ముకు పలువురు నేతలు శుభాకాంక్షులు తెలిపారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, బీజేపీ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవర్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆర్జెడి నేత తేజశ్వీ యాదవ్, బీఎస్పీ అధినేత మాయావతి, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాతో పాటు ఇతర కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తదతరులు ఆమెకు శుభాకాంక్షులు తెలిపారు. భయంగా లేకుండా రాజ్యాంగ సంరక్షణ చేయాలని యశ్వంత్ సిన్హా ఆమెకు సూచించారు.
25న ప్రమాణ స్వీకారం
రాష్ట్రపతి ఎన్నికైన ద్రౌపది ముర్ము ఈనెల 25న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమెతో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేసే మొదటి తెలుగు వ్యక్తిగా ఎన్వి రమణ నిలిచారు.
మూడు ప్రత్యేకతలు ముర్ము సొంతం
రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము మూడు ప్రత్యేకతలను సొంతం చేసుకున్నారు. మొదటి గిరిజన మహిళగా, ఇప్పటి వరకు ఎన్నిక అయిన రాష్ట్రపతుల్లో అతి పిన్న వయస్సు రాలుగా, రెండో మహిళ రాష్ట్రపతిగా ప్రత్యేకతలు సొంతం చేసుకున్నారు.
టీచర్ నుంచి రాష్ట్రపతి వరకు ముర్ము ప్రస్థానం
ద్రౌపది ముర్ము 1958 జూన్ 20న ఒరిస్సాలోని మయూర్ భంజ్ జిల్లాఉపర్బెడ గ్రామంలో జన్మించారు. సంతాలీ గిరిజన కుటుంబానికి చెందినరాలు. ఆమె తండ్రి బిరించి నారాయణ్ తుడు. ఆమె తండ్రి, తాతా ఇద్దరూ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. భర్త శ్యామ్చరణ్ ముర్ము (మృతి చెందారు). ఆమెకు ఇద్దరు కుమారులు (మృతిచెందారు), ఒక కుమార్తె ఇతిశ్రీ ముర్ము. భువనేశ్వర్‌లోని రమాదేవి ఉమెన్స్ కాలేజీలో ఆమె బీఏ చదివారు. ముర్ము నీటి పారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్ (1979-1983), రాయంగ్పూర్లో శ్రీ అరబిందో ఇంటెగ్రల్ ఎడ్యుకేషన్ సెంటర్ (1994-1997)లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశారు. 1997లో బీజేపీలో చేరారు. రాయరంగపూర్ నగర్ పంచాయితీ కౌన్సిలర్‌గా, 2000లో రాయరంగ్‌పూర్ నగర్ పంచాయతీ చైర్‌పర్సన్‌గా ఎన్నిక అయ్యారు. 2000 లో రాయరంగ్‌పూర్ ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. ఆమె బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా కూడా పని చేశారు. 2000-2002 మధ్య రాష్ట్ర రవాణా, వాణిజ్య శాఖ మంత్రి (బీజేపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం)గా పని చేశారు. 2002-2004 మధ్య పశు సంవర్ధక శాఖ మంత్రిగా పని చేశారు. 2004లో అదే నియోజకవర్గం నుంచి తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2007లో ఒరిస్సా శాసనసభ ఆమెకు ఉత్తమ ఎమ్మెల్యేగా నీలకంఠ అవార్డును ప్రదానం చేశారు. 2002-2003 మధ్య మయూర్ బంజ్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలుగా పని చేశారు. 2006-2009 మధ్య ఒరిస్సా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలుగా, 2010లో మళ్లీ మయూర్ భంజ్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు బాధ్యతలు నిర్వర్తించారు.
గతం కంటే తగ్గిన ముర్ము మెజార్టీ
గత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ కంటే ఈసారి ద్రౌపది ముర్ము సాధించిన మెజార్టీ తగ్గింది. అయితే గతం కంటే మద్దతు ఇచ్చిన పార్టీలు సంఖ్య ఈసారి పెరిగినప్పటికీ, ముర్ముకు పడ్డ ఓట్లు మాత్రం తగ్గాయి. 2017 రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు 21 రాష్ట్రాల్లో 7,02,044 (65.61 శాతం) ఓట్లు రాగా, అయితే ఇప్పుడు ద్రౌపది ముర్మకు 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 6,76,803 (64.03 శాతం) ఓట్లు వచ్చాయి. అలాగే నాటి ప్రతిపక్ష అభ్యర్థి మీరా కుమారి కంటే ఇప్పుడు ప్రతిపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఓట్లు పెరిగాయి. గత ఎన్నికల్లో మీరా కుమారికి 10 రాష్ట్రాల్లో 367,314 (34.35 శాతం) ఓట్లు రాగా, ఇప్పుడు యశ్వంత్ సిన్హాకు 27 రాష్ట్రాల్లో 3,80,177 (35.97 శాతం) ఓట్లు వచ్చాయి.