Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ :
కేంద్రం దాడులను ప్రతిఘటించాలని ప్రజలు, కార్మికులకు పిలుపు
న్యూఢిల్లీ : నిత్యవసరాలపై జీఎస్టీ విధించడాన్ని సీఐటీయూ తీవ్రంగా ఖండించింది. దీనిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఒక ప్రటకనను విడుదల చేసింది. పెట్రో ఉత్పత్తులు, వంట గ్యాస్ ధరల పెరుగుదల ద్వారా మోడీ ప్రభుత్వ వినాశకర విధానాలతో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న కార్మికులు, సామాన్య ప్రజలపై ఇప్పుడు జీఎస్టీ పెంపుతో దాడికి దిగిందని వివరించింది. స్వతంత్ర భారత చరిత్రలో బియ్యం, గోధుములు, పప్పులు వంటి ఇతర నిత్యవసరాలు, పెరుగు, పన్నీర్, మాంసం, చేపలు, బెల్లం వంటి పాడి ఉత్పత్తులపై ఎన్నడూ పన్ను విధించలేదని గుర్తు చేసింది. బ్యాంకుల నుంచి విత్డ్రా చేయటంపై ప్రజల సొంత పొదుపు బ్యాంకు చెక్కులపై 18 శాతం జీఎస్టీ విధించబడుతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత వ్యవస్థాగత సంక్షోభాన్ని ప్రతిబింబించే ప్రస్తుత ద్రవ్యోల్బణ దశలో వాస్తవ ధరల పెరుగుదలను వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ)(పారిశ్రామిక కార్మికులు) పూర్తిగా ప్రతిబింబించటంలేదని వివరించింది. క్రమమైన ఆదాయం లేని, రోజువారి సంపాదనపై ఆధారపడిన అసంఘటిత రంగ కార్మికులపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నది.
కరోనా మహమ్మారి, లాక్డౌన్ నుంచి ఇప్పటికీ కోలుకోని కార్మికులు, ఎంఎస్ఎంఈలు, ఆర్థిక వ్యవస్థ.. మరింత ఒత్తిడికి గురై అది వ్యయం మరింత కుంచించటానికి దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి నష్టంతో పాటు నిరుద్యోగం పెరగటానికి దారి తీస్తుందని పేర్కొన్నది. కనీస వేతనాలు పెంచటానికీ, ఉపాధి నష్టాన్ని ఆపటానికి వెనకాడుతున్న కేంద్రం, బీజేపీ పాలిత రాష్ట్రాలు ప్రజలపై మరింత భారాన్ని మోపుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని పుండు మీద కారం చల్లటంగా అభివర్ణించింది. ఈ కఠోర దాడులను ప్రతిఘటించాలని సీఐటీయూ కార్మికులకు, ప్రజలకు పిలుపునిచ్చింది. వచ్చే నెల 1 నుంచి 14 వరకు జరిగే ప్రచార కార్యక్రమంలో దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పాల్గొనాలనీ, 14న భారీ ప్రదర్శనలతో ఇది ముగుస్తుందని వివరించింది.