Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటు వైద్యంపైనే 70శాతం మంది
- వైద్య, ఆరోగ్య రంగాల్లో కేరళ రోల్ మోడల్
- రిపోర్టులు పరిశీలిస్తే దేశ ఆరోగ్య వాస్తవ చిత్రం బహిర్గతమవుతుంది
- ఆరోగ్యం హక్కు బిల్లుపై రాజ్యసభలో సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్
న్యూఢిల్లీ : వైద్యం కోసం ప్రజలు అప్పుల పాలవుతున్నారని సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ తెలిపారు. వైద్య, ఆరోగ్య రంగాల్లో కేరళ మోడల్ రాష్ట్రమని స్పష్టం చేశారు. ఆరోగ్యం హక్కు ప్రయివేటు మెంబర్ బిల్లుపై రాజ్యసభలో శుక్రవారం జరిగిన చర్చలో సీపీఐ(ఎం) తరఫున జాన్ బ్రిట్టాస్ మాట్లాడారు. 'విద్య ప్రాథమిక హక్కు అయినప్పుడు.. ఆరోగ్యం ముఖ్యమైనదవుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో అది ఒక భాగం. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఆరోగ్యరంగానికి ఎక్కువ బడ్జెట్ కేటాయించేలా ఆరోగ్యమంత్రి వాళ్ల నాయకత్వంతో మాట్లాడాలి. వైద్యం అందక వేలాది మంది చనిపోతున్నారు. ఆస్పత్రులకు వెళ్లినప్పటికీ కొంత మంది మరణిస్తున్నారు. ఎందుకంటే ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం వంటి కారణాలు ఉన్నాయి' అన్నారు. 'మనమందరం శ్రీలంక గురించి మాట్లాడుతున్నాం. అఖిలపక్ష సమావేశంలో విదేశాంగ మంత్రి శ్రీలంక గురించి మాట్లాడారు. అయితే శ్రీలంకలోని ఆస్పత్రుల్లో ప్రతీ వెయ్యిమందికీ మూడు బెడ్లు ఉన్నాయి. ఇది ప్రపంచ సగటు 2.9 బెడ్ల కంటే ఎక్కువ. అదే మనదేశంలో ప్రతి వెయ్యి మందికి 1.4 బెడ్లు మాత్రమే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యంపై ఎక్కువ దృష్టిపెట్టాలి.
అప్పుడే ఎక్కువ వనరులు సాధ్యం అవుతుంది. కనీసం ప్రతి వెయ్యి మందికి రెండు బెడ్లు అయినా కల్పించాలి. రెండు వందల బెడ్లతో ఐదు వేల ఆస్పత్రులు అవసరమవుతాయి' అన్నారు. వైద్య, ఆరోగ్య రంగాలకు కేటాయింపులు ప్రతి ఏడాది క్రమంగా తగ్గుతున్నాయనీ, అయినప్పటికీ కేటాయించిన నిధులు కూడా ఖర్చు చేయటం లేదని విమర్శించారు. తామేమీ కొత్తగా తీసుకొచ్చి చెప్పడం లేదనీ, కేంద్ర మంత్రి ప్రభుత్వానికి సంబంధించిన ఏజెన్సీల రిపోర్టు చూస్తే సరిపోతుందని తెలిపారు. ఎకనామిక్ సర్వే, 15వ ఆర్థిక సంఘం రిపోర్టు, జాతీయ కుటుంబ సర్వే, స్టాండింగ్ కమిటీ రిపోర్టు వంటి రిపోర్టులను పరిశీలిస్తే దేశంలోని ఆరోగ్య రంగం వాస్తవ చిత్రం కనబడుతోందని తెలిపారు.
కేరళలో 80 శాతం మందికి ప్రభుత్వ వైద్యం
దేశంలో 70శాతం మంది ప్రయివేటు వైద్యంపై ఆధారపడుతున్నారనీ, అదే కేరళలో 80 శాతం మంది ప్రజలు ప్రభుత్వ వైద్యంపై ఆధారపడుతున్నారని తెలిపారు. కరోనా సమయంలో ఉచితంగా 95 శాతం కరోనా రోగులకు వైద్యం అందించామన్నారు. మిగిలిన ఐదు శాతం కూడా మూడు శాతం రోగులకు కారుణ్య సబ్సిడీ స్కీం అందించామని తెలిపారు. తాను కేరళ గురించి మాట్లాడుతుంటే కొంత మంది అసౌకర్యానికి (బీజేపీ ఎంపీలనుద్దేశించి) గురవుతున్నారని అన్నారు. కరోనా విలయతాం డవం చేసినా.. కేంద్ర ప్రభుత్వం సవరించిన బడ్జెట్ కేటాయింపుల్లో 0.02శాతం మాత్రమే పెంచిందని విమర్శించారు.
14 శాతం మంది అప్పులు చేసుకొని ఆస్పత్రులకు వెళ్తున్నారని ఆర్థిక సంఘం చెప్పిందన్నారు. వైద్య ఖర్చుల వల్ల ప్రతి ఏడాది ఆరు కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి నెట్టబడుతున్నారని తెలిపారు. ప్రజలను పేదరికంలోకి నెట్టేస్తున్న ఆరోగ్య రంగంలో మార్పులు అవసరమనీ, ఈ దిశగా ఆలోచన చేయాలని కోరారు. ఆరోగ్యం ప్రాథమిక హక్కుగా చేయాలంటే, అందుకోసం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కేరళ వచ్చి తాము ఏం చేస్తున్నామో చూడాలని ఆహ్వానించారు.