Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భరించలేనిస్థాయికి ధరలు : ఐద్వా
న్యూఢిల్లీ : ఉప్పు, పప్పు, బియ్యం, పాలు, పెరుగు, వెన్న, బెల్లం, గోధమలు..ఇలా ఆహార పదార్థాలన్నింటిపైనా మోడీ సర్కార్ 5శాతం జీఎస్టీ విధించటాన్ని 'ఐద్వా' తీవ్రంగా ఖండించింది. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఎల్పీజీ సిలిండర్ ధరల కారణంగా ప్రజల బతుకు అత్యంత దయనీయంగా మారిందని, దీనికి తోడు ఇప్పుడు ఆహార పదార్థాలపైనా జీఎస్టీ విధించటం ప్రజల జీవన స్థితిగతుల్ని మరింత దెబ్బతీస్తుందని 'ఐద్వా' ఆందోళన వ్యక్తం చేసింది. విపరీతంగా పెరిగిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం మహిళలపై తీవ్రంగా ప్రభావం చూపుతోందని, ఇంటి ఖర్చులు అనూహ్యంగా మారిపోయాయని శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నది. కుటుంబశ్రీ, చిన్న దుకాణాల్లో ఒకటి, రెండు కిలోల నిత్యావసర సరుకులపై జీఎస్టీ వసూలు చేయబోమని ప్రకటించిన కేరళ సీఎం ప్రకటనను ఐద్వా ఆహ్వానించింది. గత 75ఏండ్లలో ఆహార పదార్థాలపై ఎన్నడూ పన్నులు విధించలేదు. ముఖ్యంగా నిత్యావసరాలైన బియ్యం, గోధుమలు, పాలు, పెరుగు, పన్నీరు, మాంసం, చేపలు, బెల్లంపై పన్నులు వేయటం ఇదే మొదటిసారి. 116 దేశాలకు విడుదల చేసిన ఆకలి సూచికలో భారత్ 101వ స్థానంలో నిలిచింది. పన్నులు రద్దు చేయకపోతే ఆకలి సూచికలో భారత్ స్థానం మరింత దిగజారుతుంది. బ్యాంక్లో ఖాతాదారుడు తన స్వంత సొమ్మును చెక్ ద్వారా విత్డ్రా చేసినా 18శాతం జీఎస్టీని విధిస్తున్నారు. శవాలకు అంతిమ సంస్కారం జరిపేచోటా, హాస్పిటల్ గదులపైనా, పెన్నులో వాడే ఇంక్పైనా మోడీ సర్కార్ జీఎస్టీ వసూలు చేస్తోంది. ఇదంతా కూడా భారత్ స్వాతంత్య్రం సంపాదించి 75ఏండ్లు పూర్తయిన సందర్భంగా దేశ ప్రజలకు మోడీ సర్కార్ ఇచ్చిన గిఫ్ట్ !