Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీ నుంచి ప్రతిపక్ష ఎంపీలు వాకౌట్
న్యూఢిల్లీ : అగ్నిపథ్ పథకంపై చర్చకు అనుమతించకపోవడంతో రక్షణ శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం నుంచి ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. బీజేపీ నేత, రక్షణ శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ జువల్ ఓరం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డులు, డీఆర్డీఓకి సంబంధించిన సమస్యలు సమావేశంలో చర్చకు జాబితా చేశారు. అయితే అయితే కాంగ్రెస్, బీఎస్పీ సభ్యులు అగ్నిపథ్ పథకంపై చర్చకు అనుమతించాలని కమిటీ చైర్మెన్‌ను కోరారు. ఈ పథకానికి భారీ చిక్కులు ఉన్నాయని, పార్లమెంటరీ పరిశీలన అవసరమని వాదించారు. సాయుధ దళాలలో అగ్నిపథ్ పథకం అతిపెద్ద మార్పు అని, ప్రభుత్వ చర్యలను పరిశీలిస్తున్న రక్షణపై పార్లమెంటరీ కమిటీలో చర్చించాల్సిన అవసరం ఉందని ప్రతిపక్ష సభ్యులు వాదించారు. అగ్నిపథ్ పథకంపై ఇప్పటికే రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, త్రివిధ దళాధిపతుల కన్సల్టేటివ్ కమిటీలో చర్చించామని చైర్మెన్‌తో వాదించారు. అగ్నిపథ్‌పై చర్చకు అనుమతించకపోవడం పార్లమెంట్‌ను అవమానించడమేననీ, పథకం గురించి కమిటీకి తెలియజేయకపోవడం అధికార ఉల్లంఘనేనని సభ్యులు వాదించారు. ''ప్రభుత్వం ఏమి దాచడానికి ప్రయత్నిస్తోంది. అగ్నిపథ్ పథకం గురించి ఈ రహస్యం ఏమిటి'' అని పశ్నించారు. దీనికి చైర్మెన్ ఓరం స్పందిస్తూ దీన్ని పార్లమెంట్ చర్చించాలని సూచించారు. అందుకు ప్రతిపక్ష సభ్యులు ఇప్పటికే పార్లమెంట్ ఉభయ సభల్లో నోటీసులు ఇచ్చామని, కానీ చర్చకు అనుమతించటం లేదని తెలిపారు. అలాంటప్పుడు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలోనే చర్చించాల్సి ఉంటుందని ప్రతిపక్ష సభ్యులు స్పష్టం చేశారు. అలాగే గత బడ్జెట్లో కూడా ఈ పథకాన్ని పెట్టలేదని, ఈ పథకం ఆర్థికపరమైన అంశానికి సంబంధించినదని తెలిపారు. అందుకు చైర్మెన్ ఓరం అనుమతించలేదు. ప్యానల్ సమావేశంలో దాదాపు అరగంట పాటు చర్చ జరిగిన తర్వాత ప్యానల్లో సభ్యులుగా ఉన్న కాంగ్రెస్ ఎంపీలు కెసి వేణుగోపాల్, ఉత్తమ్ కుమార్‌రెడ్డితో పాటు బీఎస్పీ ఎంపీ దానిష్ అలీ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. వివాదాస్పద అగ్నిపథ్ స్కీమ్‌ను చర్చించాలని తాము పదేపదే కోరినప్పటికీ, తాను ఇంతకుముందు లేఖ పంపినప్పటికి వివాదాస్పదమైన అగ్నిపథ్ పథకాన్ని చేపట్టనందుకు నిరసనగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, దానిష్ అలీ, తాను వాకౌట్ చేశానని వేణుగోపాల్ ట్విట్టర్లో తెలిపారు. ''అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్‌పై రక్షణ పార్లమెంటు స్టాండింగ్ కమిటీని ఎందుకు చీకటిలో ఉంచారు? ఆర్థిక పరమైన చిక్కులు ఉన్నప్పటికీ కమిటీ బడ్జెట్ పరిశీలన సమావేశాల్లో పథకాన్ని ఎందుకు తీసుకోలేదు? ఈ కీలకమైన ప్రశ్నలు, పథకం గురించి చర్చించబడలేదు. పార్లమెంట్లో చర్చలు జరగవు, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీల్లో చర్చలు జరగవు, మోడీ హయాంలో చట్టాలను బుల్డోజింగ్ చేసే విధంగా సాగుతుంది'' అని కెసి వేణుగోపాల్ విమర్శించారు. ఉభయ సభల బిజినెస్ అడ్వజరీ కమిటీ సమావేశాల్లోనూ తాము ఈ అంశాన్ని లేవనెత్తామని, అయితే ఈ అంశంపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని వారు పేర్కొన్నారు. వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ సమావేశంలోనే ఉన్నారు. కానీ ఆయన ఈ అంశంపై స్పందించలేదని సమాచారం.