Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛత్తీస్గఢ్లో ప్రభుత్వ ఉపాధ్యాయుల నిర్వాకం
- విరుగుడుగా పాఠశాల గోడలపై టీచర్ల ఫోటోలు
రాయ్పూర్ : పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారిని సమాజంలో చక్కటి పౌరులుగా ఎదిగేందుకు పునాదులు వేయాల్సిన ఉపాధ్యాయులే విలువలకు తిలోదకాలిస్తున్నారు. తమ స్థానాల్లో వేరే వారితో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. అడ్డదారుల్లో ప్రభుత్వ సొమ్మును జీతాల రూపాల్లో దండుకుంటున్నారు. ఛత్తీస్గఢ్లో ప్రభుత్వ ఉపాధ్యాయుల కుయుక్తులు ఒక సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలో జూన్ 15 నుంచి పాఠశాలలు ప్రారంభమ య్యాయి. ఈ తరుణంలో ప్రభుత్వ పాఠశాల్లో ఉపాధ్యాయుల వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. తమ స్థానాల్లో వేరొకరిని నియమించు కుంటూ పిల్లలకు పాఠాలు బోధించిన ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ఆకస్మిక తనిఖీల్లో ఇలాంటివి చాలా బయటపడ్డాయి. దీంతో ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ ఉపాధ్యాయుల ఫోటోలు పాఠశాల బిల్డింగుల గోడల మీద అతికించాలని రాష్ట్ర విద్యా శాఖ నిర్ణయించింది. అలాగే, స్కూళ్లలో నియమితులైన ఉపాధ్యాయుల అన్ని వివరాలనూ, వారి పత్రాలను పరిశీలించాలని పాఠశాల యంత్రాంగాలను ఆదేశించింది. దీనిపై పది రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని 'సమగ్ర శిక్షా' డైరెక్టర్ నరేంద్ర దుగ్గా అన్ని జిల్లాల విద్యా శాఖాధికారులకు సూచించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల తీరుపై చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేది తమలాంటి పేద కుటుంబాలకు చెందిన చిన్నారులేననీ, ప్రభుత్వ ఉపాధ్యాయులగా నియమితులై జీతాలు అందుకొని విధులను విస్మరించటం ఏ మాత్రమూ సరైన చర్య కాదని తెలిపారు.